మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. నలుగురు అగ్ర నేతల హతం!
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్ గఢ్– మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలిలో మార్చి 19న తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో మావోయిస్టులకు భారీ న ష్టం వాటిల్లింది. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. మరణించినవారిలో మావోయిస్టు అగ్రనేతలు డీవీసీ సభ్యుడు వర్గీష్ తోపాటు ప్లాటూన్ సభ్యులు మంగాతు, కురుసం రాజు, వెంకటేష్ ఉన్నారని చెబుతున్నారు.
గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుకావడంతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను సీజ్ చేశారు.
సీ60 కమాండోలతో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఏకే 47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్ తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కమాండోలు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు మృతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేతలు ఉన్నారని చెబుతున్నారు. కొమురం భీం – మంచిర్యాల డివిజన్ కమిటి సభ్యునిగా వర్గేష్ కొనసాగుతున్నాడని తెలుస్తోంది.
గత ఐదేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీ బలోపేతం కోసం వర్గేష్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పోలీసుల నిర్భంధం విధించడంతో అతడు మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
అలాగే మరో మావో నేత మంగ్తు.. సిర్పూర్ –చెన్నూరు ఏరియా కమిటి సభ్యునిగా ఉన్నాడని చెబుతున్నారు. వీరితో పాటు వెంకటేష్, రాజు.. ప్లాటూన్ సభ్యులుగా ఉన్నారు. వీరి నలుగురిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఈ నలుగురు మార్చి 18న ప్రాణహిత నది దాటి తమ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు.