మరాఠీ రాని పాపానికి ఇద్దరు అమ్మాయిలకు దేహశుద్ధి! థానేలో దారుణం!
ఆ వీడియోలో కొందరు వ్యక్తులు ఆ ఇద్దరు అమ్మాయిలను కొడుతూ హింసిస్తూ కనిపించారు.;

మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. డోంబివ్లీ అనే ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు కేవలం 'ఎక్స్‌క్యూజ్ మీ' అని ఇంగ్లీష్‌లో అన్నందుకు కొందరు వ్యక్తులు వారిపై దాడి చేశారు. ఎవరో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు ఆ ఇద్దరు అమ్మాయిలను కొడుతూ హింసిస్తూ కనిపించారు.
ఈ ఘటన జూని డోంబివ్లీ (పాత డోంబివ్లీ) ప్రాంతంలో జరిగింది. బాధితులు ఇద్దరు ఒక టూ-వీలర్‌పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వారి దారికి అడ్డంగా నిలబడ్డారు. దాంతో ఒక అమ్మాయి దారి ఇవ్వమని మర్యాదగా 'ఎక్స్‌క్యూజ్ మీ' అని అడిగింది. అంతే.. ఆ ముగ్గురు ఒక్కసారిగా రెచ్చిపోయారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, అనిల్ పవార్, బాబాసాహెబ్ ధుబ్లే, నితేష్ ధుబ్లే అనే ముగ్గురు వ్యక్తులు ఇంగ్లీష్‌లో మాట్లాడటాన్ని తప్పుగా భావించారు. 'మరాఠీలో ఎందుకు మాట్లాడలేదు?' అని వాగ్వాదానికి దిగారు. పరిస్థితి క్షణాల్లో చేయి దాటిపోయింది. ఆ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిలను కొట్టారని తెలుస్తోంది.
బాధితులు విష్ణు నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 115(2), 352, 324(4) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు హాని కలిగించే ఉద్దేశం, దాడి చేయడం, స్వచ్ఛందంగా గాయపరచడం వంటి నేరాలకు సంబంధించినవి.
ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం ముంబైలోని పవాయిలో ఎల్ అండ్ టీ ప్రాంగణంలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డు కూడా చిక్కుల్లో పడ్డాడు. అతను మరాఠీ భాషను కించపరిచేలా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నేరుగా అక్కడికి వెళ్లి ఆ గార్డును నిలదీయడమే కాకుండా దాడి కూడా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఆ గార్డు మరాఠీలో మాట్లాడటానికి నిరాకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. ఒక సందర్భంలో అతను "మరాఠీ గయా తేల్ లగానే" (మరాఠీ నరకానికి పోవచ్చు) అని అన్నట్లు వినిపించింది. దీంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. లోక్‌షాహి మరాఠీ న్యూస్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియోలో ఆ గార్డు చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నట్లు కనిపించాడు. పార్టీ కార్యకర్తలు అతన్ని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు లేదా అధికారిక చర్య తీసుకోలేదని తెలుస్తోంది.