జో బైడెన్ ప్రభుత్వంపై జుకర్ బుర్గ్ తీవ్ర ఆరోపణలు

కొవిడ్ టీకా.. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో వైరస్ స్థాయిలో వైరల్ అయిన అంశం.

Update: 2025-01-11 19:30 GMT

కొవిడ్ టీకా.. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో వైరస్ స్థాయిలో వైరల్ అయిన అంశం. కొవిడ్ కు టీకా తీసుకోవాలా? వద్దా? అనేది చాలా పెద్ద సందేహం. భారత దేశంలో తక్కువే అయినా.. విదేశాల్లో మరీ ముఖ్యంగా బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో టీకా సైడ్ ఎఫెక్ట్స్ పై విపరీతమైన గందరగోళం నెలకొంది.

ఓవైపు పెద్దఎత్తున ప్రజల మరణాలు.. మరోవైపు వైరస్ బాగా వ్యాపిస్తుండడంతో ఏం చేయాలో ప్రభుత్వాలకూ పాలుపోని పరిస్థితి. కొవిడ్ కు అప్పటికప్పుడు టీకా తయారు చేసేలా ఫార్మా కంపెనీలను సంసిద్ధం చేయాల్సిన పరిస్థితి. తీరా టీకా మార్కెట్ లోకి వచ్చాక అనేక అనుమానాలు. కొవిడ్ వ్యాక్సిన్ గుండె పోట్లకు కారణం అవుతోందంటూ ఆరోపణలు.

ఇక కొవిడ్ టీకా దుష్ప్రభావాలపై ఎన్నో వివరణలు వచ్చాయి. కానీ, వాటి కంటే ప్రజల్లోకి భయాలే ముందుగా వెళ్లాయి. ఇప్పుడు ప్రపంచ దిగ్గజ సంస్థ మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఓ సంచలన ఆరోపణతో ముందుకొచ్చారు. వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలకు సంబంధించిన పోస్టులను తీసేయాలని బైడెన్ ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చిందని ఆయన తెలిపారు.

‘ద జో రోగన్‌ ఎక్స్‌ పీరియన్స్‌’ పాడ్‌ కాస్ట్‌ లో పాల్గొన్న జుకర్ బర్గ్ ఈ మేరకు స్పందించారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో బైడెన్ సర్కారు టీకాలను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన పోస్టులను తీసేయాలంటూ పెద్దఎత్తున కథనాలు వచ్చాయని జుకర్ బర్గ్ తెలిపారు.

అయితే, తాను వ్యక్తిగతంగా వ్యాక్సినేషన్ కు అనుకూలం అని.. వాటితో ప్రతికూలత కంటే సానుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు.

ఇక కొవిడ్ టీకాలను తెచ్చే ప్రయత్నాలు జరుగుతుండగా వాటి గురించి వినిపించిన వాదనలను సెన్సార్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపించిందని జుకర్ బర్గ్ పేర్కొన్నారు.

తన సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర కంటెంట్‌ ను సెన్సార్‌ చేయాలని అధ్యక్ష కార్యాలయం వైట్‌ హౌస్‌ సిబ్బంది నుంచి ఒత్తిడి వచ్చిందన్నారు. కాగా, ఇదంతా హాస్యాస్పదంగా అనిపించిందని, సెన్సార్ చేయకూడదని తాను భావించానని జుకర్‌ బర్గ్‌ తెలిపారు.

టైటానిక్‌ నటుడు డికాప్రియోపై వచ్చిన మీమ్‌ కూడా వైట్ హౌస్ వారు తీసేయమన్న పోస్టుల్లో ఒకటిగా జుకర్ బర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News