పదవులు పంచారు.. తమ్ముళ్లు హ్యాపీ!
ఏపీ అధికార కూటమి పార్టీల నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను తాజాగా సీఎం చంద్రబా బు పంచేశారు.;

ఏపీ అధికార కూటమి పార్టీల నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను తాజాగా సీఎం చంద్రబా బు పంచేశారు. ఇటీవల 47 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వగా.. తాజాగా శుక్రవారం సాయంత్రం మరో 38 పదవులకు నాయకులను ప్రకటించారు. ఇక, కూటమి ధర్మానికి కట్టుబడి.. ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేలు.. వారి హవాను దృష్టిలో పెట్టుకుని కూటమి పార్టీలకు కూడా న్యాయం చేశారు. మొత్తం 38 పదవులు ఇవ్వగా.. వీటిలో 31 టీడీపీకి దక్కాయి. మరో 6 జనసేన పార్టీకి ఇచ్చారు. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాత్రం బీజేపీకి కేటాయించారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని యర్రగుంట్ల పల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన అనుచరుడిగా పేరున్న రామిరెడ్డిపల్లి నాగరాజుకు నామినేటెడ్ పదవి వరించింది. గతంలో ఆదినారాయణరెడ్డితో పాటు.. కాంగ్రెస్‌లోనూ పనిచేసిన నాగరాజు.. తర్వాత.. బీజేపీ బాట పట్టారు. ఇప్పుడు ఆయనకు పదవి ఇవ్వడం వెనుక ఆదినారాయణ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అయితే.. తమకు ఈ దఫా 4 నుంచి 5 పదవులు ఇవ్వాలని బీజేపీ భావించినా.. నాయకులు ఎక్కువ మంది పదవుల వేటలో రెడీగా ఉన్ననేపథ్యంలో చంద్రబాబు ఒక్కస్థానాన్ని మాత్రమే ఆ పార్టీకి కేటాయించారు.
ఇక, గన్నవరం, భీమిలి, కొత్తపేట, ఉండి, రాజాం, పెడన నియోజకవర్గాల్లోని మార్కెట్ కమిటీ చైర్మన్‌ల పదవులను జనసేన పార్టీకి కేటాయించారు. ఆయా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహిళలకు సైతం అవకాశం కల్పించారు. పెడన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అనంతలక్ష్మిని నియమించారు. రాజాం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పోగిరి కృష్ణవేణికి అవకాశం ఇచ్చారు. అలాగే ఆలమూరు(కొత్తపేట) మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొత్తపల్లి వెంకట లక్ష్మికి అవకాశం కల్పించారు. మిగిలిన మూడు స్థానాల్లో పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించడం గమనార్హం. ఇక, టీడీపీ 31 మార్కెట్ కమిటీలను దక్కించుకుంది. వీటిలో 12 మహిళలకు కేటాయించారు. దీంతో తమ్ముళ్లు ఖుషీ అవుతుండడం గమనార్హం.