మేడిగడ్డ నిర్మాణంపై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలు బాధ్యత ఎవరిది?

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు

Update: 2023-12-17 06:25 GMT

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని ప్రధాన లక్ష్యం. 2016, మే 2న దీనికి ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూరేలా రూపకల్పన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని బరాజ్ లు, పంపు హౌస్ లు, కాలువలు, సొరంగాల సమాహారంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వద్ద ఉంది. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం. తెలంగాణ రాష్ట్రంలోని 195 టీఎంసీల నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడినది. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులోని ఒక ప్రాజెక్టే మేడిగడ్డ. ఈ ప్రస్తుతం అంతటా చక్కర్లు కొడుతున్నది. దీనికి కారణం.. ప్రాజెక్టు పూర్తయిన కొన్ని నెలలకే ఒక పిల్లర్ కుంగిపోయి వార్తల్లో నిలిచింది.

అసలు ఏమైంది..

మేడిగడ్డ బరాజ్ వంతెన ఏడో నంబర్ బ్లాక్ పియర్ అక్టోబర్ 21న కుంగింది. ఈ ఘటన ఎన్నికల షెడ్యూల్ కు ముందే జరగడంతో అధికార బీఆర్ఎస్, విపక్షాల మాట యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని వివరణ కోరింది. ఈ క్రమంలో నీటిశాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు బ్యారేజీని పరిశీలించారు. బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోనే ఉందని, పునరుద్ధరణ పని వారే చేపట్టాలని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు పేరుతో ప్రకటన విడుదలైంది. ఇందుకు నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ కూడా తామే సొంతంగా పనులు చేపడతామని ఓ లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందాన్ని పంపింది. ఆ బృందం విచారణ చేసి బ్యారేజ్ కుంగడానికి గల కారణాలను విశ్లేషించింది. కుంగిన ఏడో బ్లాక్ ప్రాంతానికి నీటి ప్రవాహం లేకుండా చేసేందుకు కాపర్ డ్యాం నిర్మించే ప్రయత్నం చేస్తుండగా, తాజాగా నిర్మాణ సంస్థ రాసిన లేఖతో మరొసారి కలకలం మొదలైంది.

ఆ లేఖ సారాంశం ఏంటి?

చేసిన పనికి తగ్గట్లు బిల్లు చెల్లించే పద్ధతిలో ఒప్పందం జరిగిందని, డిజైన్ ను మాత్రం నీటిపారుదల శాఖ అందజేసిందని ఎల్ అండ్ టీ మేనేజర్ సురేశ్ కుమార్ డిసెంబర్ 2న రామగుండం ఈఎన్సీకి లేఖ రాశారు. దీని ప్రకారం.. 2018, ఆగస్టు 25 వరకు పని పూర్తి చేయాల్సి ఉండగా, 2020, జూన్ 29 నాటికి అయిపోయింది. ఇందుకు రూ. 3,062.79 కోట్లు చెల్లించాలని ఒప్పందం జరుగగా, టెండర్ వేసిన దాని కంటే 2.7శాతం ఎక్కువ కోట్ చేయడం, పెరిగిన ధరలు తదితరవి పరిగణనలోకి తీసుకొని మొత్తం రూ.3348.24 కోట్లు గుత్తేదారుకు చెల్లించారు. ఒప్పందం మేరకు 2021, మార్చి 15న పని పూర్తయినట్లు సంబంధిత ఎస్ ఈ ధ్రువీకరణ పత్రం అందజేశారు. సంస్థ, ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఏదైనా నష్టం వాటిల్లితే 24 నెలల వరకు బాధ్యత ఉంటుంది. కాగా, 2020 జూన్ 29 నుంచి 2021 మార్చి 29 వరకు బాధ్యత వహించే పిరియడ్ గా పేర్కొన్నామని, 2021 మార్చి 15న పని పూర్తయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని లేఖలో వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ అందజేశారు. ఇదిలా ఉండగా, ఈఎన్సీ నుంచి గత అక్టోబర్ 25న, నవంబర్ 25న రెండు లేఖలు రాగా, అందులో కొత్త పని చేపట్టాలంటే మళ్లీ ప్రత్యేకంగా ఒప్పందం ఉండాలని, ఇది పరస్పర అవగాహనతోనేనని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. కాపర్ డ్యాం నిర్మించాలంటే మరో రూ.55.75 కోట్లు కావాలని తెలిపింది.

మరి పునరుద్ధరణ బాధ్యత ఎవరిది?

మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగడం ఒక ఎత్తయితే దాన్ని పునరుద్ధరించడం ఎవరి బాధ్యత అనేది ఇప్పుడు కొత్త సమస్యకు ఆజ్యం పోస్తున్నది. అది తమ బాధ్యత కాదని, లేఖలో స్పష్టంగా పేర్కొన్నామంటూ నిర్మాణ సంస్థ చెబుతున్నది. పోనీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్మించాలంటే మరో రూ.56 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన వ్యయం ఎక్కువని, మళ్లీ రిపేర్ కోసం ఇంతమొత్తం భరించాలంటే కష్టమన్న సంకేతాలు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్నది. మరి ఇది ఎవరి బాధ్యతని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News