వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు.. భారత్ కు తీసుకొస్తున్నారా?

ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.;

Update: 2025-04-14 05:45 GMT
Mehul Choksi Arrested in Belgium Police

ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం ముంబయి బాంబు పేలుళ్లలో కీలక నిందితుల్లో ఒకడైన తహవ్వుర్ రాణాను భారత్ కు తీసుకురావటంలో విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం కూడా కాక ముందే మరో అంతర్జాతీయ సంచలనం చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలాది కోట్ల రూపాయిలతో ముంచేసి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని తాజాగా బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని భారత్ కు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అతడు బెల్జియంలో ఉన్నట్లుగా అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో అతడ్ని అదుపులోకి తీసుకోవాలని భారత్ కోరింది. దీంతో.. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు ఛోక్సీని అదుపులోకి తీసుకున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.

నిజానికి ఛోక్సీని గత శనివారమే అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో అతను బెయిల్ దరఖాస్తు చేసుకునే వీలుందని చెబుతున్నారు. అరెస్టు చేసిన నేపథ్యంలో అతడ్ని భారత్ లోనేి దర్యాప్తు సంస్థలైన సీబీఐ.. ఈడీ అధికారులకు అప్పగించాలని భారత్ కోరనుంది. కాకతాళీయంగా జరుగుతున్నాయా? ప్రణాళికలో భాగంగా జరుగుతున్నాయో తెలీదు కాదు.. రాణా వచ్చిన వారంలోనే .. కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఛోక్సీ అరెస్టు ప్రాథాన్యతను సంతరించుకుందని చెప్ాపలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను దాదాపు రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశాడు ఛోక్సీ. ఈ మేరకు అతడిపై భారీ ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018లో జరిగిన ఈ ఉదంతంలో ఛోక్సీ విదేశాలకు పారిపోగా.. అతడి మేనల్లుడు నీరవ్ మోడీ సైతం దేశం విడిచి పారిపోయారు. దీంతో.. దేశంలో ఘరానా మోసాలకు పాల్పడటం ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారని.. ఈ వ్యవహారంలో మోడీ సర్కారు చేష్టలుడిగినట్లు చూస్తుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఛోక్సీ ఆంటిగ్వా - బార్బుడాకు వెళ్లగా.. నీరవ్ మోడీ లండన్ లో ఆశ్రయం పొందరు. వీరిని భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు భారత సర్కారుపెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఇప్పటి వరకు వాస్తవ రూపం దాల్చలేదు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా - బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ.. ఛోక్సీ తమ దేశ పౌరుడేనని.. అతను ప్రస్తుతం తమ దేశంలో లేడన్నారు. వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అతడ్ని అప్పగించే విషయంలో రెండు దేశాలు పని చేస్తాయని చెప్పారు.

ఈ క్రమంలో ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన భార్య ప్రీతి ఛోక్సీ సాయంతో అతను 2023 నవంబరులో ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందారని చెబుతారు. దీని కింద కొన్ని షరతులకు లోబడి జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చని చెబుతారు. ఆసక్తికర విషయం ఏమంటే.. ఇప్పటికి ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ కేసులో మరో నిందితుడైన నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. ఛోక్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో త్వరలోనే భారత్ కు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News