జుకర్ బర్గ్ వ్యాఖ్యల్ని భారత్ ఎందుకంత సీరియస్ గా తీసుకుంది?

ఇంతకూ జుకర్ బర్గ్ ఏమన్నారు? ఎక్కడ అన్నారు? ఆయన మాటల్ని భారత సర్కారు ఎందుకంత సీరియస్ గా తీసుకుంది?

Update: 2025-01-15 04:07 GMT

దిగ్గజ సోషల్ మీడియా ‘మెటా’కు భారత సర్కారు సమన్లు జారీ చేయనుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా సంస్థకు బాస్ మార్క్ జుకర్ బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని భారత సర్కారు సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసి.. వివరణ తీసుకోవాలని భావిస్తోంది. ఇంతకూ జుకర్ బర్గ్ ఏమన్నారు? ఎక్కడ అన్నారు? ఆయన మాటల్ని భారత సర్కారు ఎందుకంత సీరియస్ గా తీసుకుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఇటీవల జుకర్ ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడారు.

జనవరి పదిన ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న జుకర్.. ‘‘2024 సంవత్సరం భారీ ఎన్నికల ఇయర్ గా నిలిచింది. భారత్ తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే.. అన్ని చోట్లా అక్కడి ప్రభుత్వాలు ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్ చేసిన విధానం. దాని కారణంగా దారి తీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం’ అని వ్యాఖ్యానించారు. భారత సర్కారు అభ్యంతరమంతా ఎక్కడంటే.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సర్కారు మరోసారి విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

జుకర్ లాంటి వ్యక్తి నోటి నుంచి భారత అధికార పక్షం మీద ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావం నెగిటివ్ గా మారటమే కాదు.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందేలా చేస్తుందన్నది భారత్ వాదన. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం దేశ ప్రతిష్టకు భంగం కలిగించటమే అవుతుందన్నది కేంద్రం వాదన. ఈ తప్పునకు భారత దేశ చట్టాలకు.. చట్టసభ్యులకు జుకర్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ ఎంపీ, ఐటీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంటరీ హౌ్ ప్యానెల్ ఛైర్మన్ నిషికాంత్ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధ్రువీకరించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకే ఈ సమన్లుగా ఎక్స్ లో పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే సర్కారుపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గత ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని.. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందన్నారు. కొవిడ్ తర్వాత భారత్ తో సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయినట్లుగా జుకర్ చెప్పటంలో వాస్తవం లేదన్నారు. మరి.. భారత్ పంపే సమన్ల విషయంలో జుకర్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News