హైదరాబాద్ మెట్రోలో ఒకే ట్రాక్ మీదకు 2 రైళ్లు.. నో ప్రాబ్లమట
దీంతో మెట్రో భద్రతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూ టెన్షన్ పడిపోయారు.
ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకే టైంలో వస్తే? ఆ మాట విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. టెన్షన్ వచ్చేస్తుంది. కానీ.. అలాంటిది జరిగినా ఎలాంటి సమస్యా ఉండదని అభయమిస్తున్నారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. తాజాగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక మెట్రో స్టేషన్ లో మెట్రో రైలు ఆగి ఉన్న వేళలోనే.. అదే ట్రాక్ లోకి మరో ట్రైన్ వచ్చేసిన ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ అవుతున్న పరిస్థితి. దీంతో మెట్రో భద్రతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూ టెన్షన్ పడిపోయారు.
ఇలాంటి వేళ.. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందిస్తూ.. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని.. అత్యాధునిక సాంకేతికతో నడిచే హైదరాబాద్ మెట్రో రైలుకు ఇలాంటి ఉదంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగవని.. దానికి సంబంధించిన రక్షణ చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నిజానికి హైదరాబాద్ మెట్రోకు ఉన్న సానుకూలతే ఇదన్నారు. ఎలాంటి ఆందోళనలు అక్కర్లేదన్న ఆయన.. దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ మెట్రోలో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ అనే వ్యవస్థ ఉందన్నారు. ఉప్పల్ లోని ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ నుంచి మూడు కారిడార్లలోని మెట్రోల రాకపోకల్ని నియంత్రించే విషయాన్ని గుర్తు చేస్తూ.. సీబీటీసీతో మెట్రో రైళ్లు ప్రతిక్షణం తమ ఉనికిని.. తమ గమనాన్ని ఓసీసీకి తెలియజేస్తూ ఉంటాయన్నారు.
ఇంటెలిజెంట్ రైళ్లు ఒక దానితో మరొకటి మాట్లాడుకుంటాయన్న ఆయన.. ఈ కారణంతో ఢీకొనే అవకాశమే లేదన్నారు. ఒకే ట్రాక్ మీదకు అనుకోకుండా రెండు రైళ్లు వచ్చినప్పటికీ.. కొన్నిమీటర్ల దగ్గరకు వచ్చినంతనే ఆగిపోయేలా డిజైన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ టెక్నాలజీ తాను మొదటిసారి యూరోప్ లో చూసి.. ఇదే విధానాన్ని భారత్ కు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎల్ అండ్ టీకి చెప్పటం.. వారు అంగీకరించి ఏర్పాటు చేశామన్నారు. ఈ తరహా సాంకేతికత ఉన్న మొదటి మెట్రో హైదరాబాదే అన్న ఆయన.. 30 మీటర్ల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా రైళ్లు ఆగిపోయే టెక్నాలజీ మనసొంతమన్నారు. ఈ కారణంగా ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పటికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. అన్ని తెలిసిన మెట్రో ఎండీకి టెన్షన్ లేకపోవచ్చు.. సామాన్యులకు మాత్రం టెన్షన్ ఉండకుండా ఉంటుందా చెప్పండి?