ఇడ్లీ, సాంబార్ వల్లే టూరిస్టులు రావట్లేదు.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!
గోవాలో కొంతకాలంగా పర్యాటకులు సంఖ్య తగ్గిందని చెబుతూ.. అందుకు ఒక కీలక కారణం ఉందంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.;
గోవాలో కొంతకాలంగా పర్యాటకులు సంఖ్య తగ్గిందని చెబుతూ.. అందుకు ఒక కీలక కారణం ఉందంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గోవా బీచ్ లో ఇడ్లీ, సాంబార్, వడ పావ్ లు విక్రయించడం వల్లే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అవును... నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో... గోవాలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ఇక్కడ బీచ్ లలో ఇడ్లీ-సాంబార్, వడా పావ్ లు విక్రయించడమే కారణమని అన్నారు. గోవాలో విదేశీ పర్యాటకులు సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... బెంగళూరు నుంచి వచ్చిన వారు బీచ్ షాపుల్లో వడా పావ్ లు అమ్ముతున్నారని.. ఇంకొంతమంది ఇడ్లీ, సాంబార్ విక్రయిస్తున్నారని.. అందువల్లే గత రెండేళ్లుగా గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందని.. దీనిపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు.
ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ షాపులు అద్దెకు ఇవ్వడంపైనా ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా.. తగ్గుతున్న పర్యాటకుల సంఖ్య తగ్గడంపై కారణాలు అన్వేషించేందుకు పర్యాటక శాఖతో సహా భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భేటీ అయ్యి చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇదే సమయంలో... స్థానిక ట్యాక్సీలు, క్యాబ్ ల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని.. ఈ పరిస్థితులను సరిదుద్దుకోకుంటే పర్యాటకానికి చీకటి రోజులేనని హెచ్చరించారు. పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వం మాత్రమే కారణం కాదని.. అందరూ దీనికి బాధ్యులేనని గ్రహించాలని బీజేపీ ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు.