ఎన్నికలకు కాస్త ముందు దీదీకి షాకిచ్చిన నటి

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది

Update: 2024-02-16 04:24 GMT

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. అది కూడా తమ పార్టీకి చెందిన ఎంపీ కం సినీ నటి చేతిలో కావటం ఆసక్తికరంగా మారింది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా సినీ నటి మిమి చక్రవర్తిని ఎంపిక చేయటం.. ఆమె ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.

అలాంటి ఆమె.. కీలక లోక్ సభ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత్రి మంతకు పంపారు. తాను రాజకీయాలకు పనికిరానన్న విషయం తనకు అర్థమైనట్లుగా ఆమె పేర్కొన్నారు. ఎంపీ పదవికి మాత్రమే కాదు పార్టీకి ఆమె గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తన రాజీనామాకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓకే చేసిన తర్వాత.. లోక్ సభ స్పీకర్ కు రాజీనామా పత్రాన్నిపంపుతానని మిమి చక్రవర్తి వెల్లడించారు.

రాజకీయాలకు తాను సరిపోనన్న విషయం తనకు ఇప్పటికి అర్థమైందని ఆమె పేర్కొనటం గమనార్హం. రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన ఆమె ముఖ్యమంత్రి దీదీని కలిశారు. నిజానికి తన రాజీనామా లేఖను ఫిబ్రవరి 13నే పంపినా..సీఎం దీదీని స్వయంగా కలిసి తన పరిస్థితిని వివరించినట్లుగా చెబుతున్నారు.

తనకు రాజీనామాలు పడవని అనుభవం ద్వారా తెలుసుకున్నట్లుగా ఆమె చెబుతున్నారు. అందుకే.. ఎన్నికలకు కాస్త ముందుగా అందులో నుంచి బయటకు వచ్చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏమైనా.. ఐదేళ్లు ఎంపీగా అధికారాన్ని వెలగబెట్టి.. ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్న వైనం టీఎంసీకి ఇబ్బందికర పరిస్థితిగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నేళ్లకు ఈ విషయం అర్థమైందా? అంటూ సదరు ఎంపీపై విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News