టీ-కాంగ్రెస్‌లో హాట్ టాపిక్స్.. తేలేదెన్నడు?!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.. రెండు కీలక విషయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.. రెండు కీలక విషయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇవి ఎప్పుడు ముడిపడతాయన్నది ఆసక్తిగా ఉండడమే కాదు.. ఇవి సంచలనాలకు కూడా వేదికగా మారనున్నాయనడంలో సందేహం లేదు. 1) మంత్రి వర్గ విస్తరణ. 2) బీసీ ముఖ్యమంత్రి. ఏ ఇద్దరు నాయకులు కలిసినా ఈ రెండు విషయాలే చర్చకు వస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం.. కొన్నాళ్లుగా నలుగుతూనే ఉంది. అదిగో విస్తరణ అంటే.. ఇదిగో విస్తరణ అంటూ.. మీడియాలో కథనాలు రావడమే తప్ప.. కాలు ముందుకు పడడంలేదు.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న పరిణామాలు.. మంత్రి వర్గ విస్తరణపై ప్రభావం చూపుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా గడవకముందే.. మంత్రివర్గంలో మార్పు లు చేస్తే.. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్న చర్చ సాగుతోంది. మరోవైపు.. కేంద్రం నుంచి ఎదురవుతున్న సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో రాష్ట్రంపై దృష్టిపెట్టేలా చేయలేక పోతున్నాయన్న చర్చ కూడా ఉంది. వెరసి ఈ ప్రభావం మంత్రివర్గ విస్తరణపై కనిపిస్తోంది.
మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన భిన్నంగా ఉంది. స్థానిక సమరంలో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. మంత్రి వర్గం విస్తరణను ఊరించాలన్నది ఆయన వ్యూహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆశావ హులు ఎందరో ఉన్న నేపథ్యంలో .. వారంతా కలసి కట్టుగా పనిచేసేందుకు.. మంత్రి వర్గ విస్తరణ మం త్రంగా పనిచేస్తుందని రేవంత్ ఆలోచన. అలా కాకుండా.. ఇప్పటికిప్పుడు విస్తరణ చేస్తే.. అది వ్యతిరేక ఫలాలు ఇచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉందన్న లెక్కలు కూడా వేస్తున్నారు.
ఇక, కీలకమైన మరో అంశం.. బీసీని ముఖ్యమంత్రిని చేయడం. రాష్ట్రంలో 46 శాతం మంది బీసీలు.. కేవలం 12 -20 శాతం లోపు రెడ్లు ఉన్న నేపథ్యంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ ఇప్పుడిప్పుడే.. జిల్లాలస్థాయిలో వినిపిస్తోంది. దీనికి మానసికంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రెడీ అయ్యారు. ఆయనే స్వయం తానే చిట్టచివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఫర్వాలేదన్న విషయాన్ని కూడా చర్చిస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఎన్నికలకు ముందు మాత్రం బీసీ ముఖ్యమంత్రి ఖాయమని.. నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు అంశాలే.. టీ కాంగ్రెస్‌లో ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం.