బాలినేని కోసం పవన్... బాబుకు ఇలాంటివి కొత్తేమీ కాదంట!

గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన బాలినేని విషయంలో పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ మొదలైంది.

Update: 2024-11-27 15:30 GMT

ఏపీ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్ లో ఉంది! ప్రస్తుతం ఈ విషయంపైనే కూటమి పార్టీల్లో అంతర్గత చర్పోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన బాలినేని విషయంలో పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ మొదలైంది.

అవును... ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు కూటమి పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. అలా చేరినవారిలో బాలినేని ఒకరు. అయితే... ఈయన చేరిక వెనుక ఓ ప్రామిస్ దాగి ఉందని అంటున్నారు.

ఈ క్రమంలో వైసీపీ నుంచి జనసేనలో చేరే సమయంలో పవన్ నుంచి బాలినేని శ్రీనివాస్ కు ఓ హామీ దక్కిందని.. అది అమలు పరచాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఇందులో భాగంగా... బాలినేనికి ఎమ్మెల్సీ పదవితో పాటుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని పవన్ హామీ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు దానికి టైం వచ్చిందని చెబుతున్నారు.

అయితే... బాలినేని జనసేనలోకి వచ్చిన సమయం నుంచి ఒంగోలు టీడీపీ నేతలు కారాలూ, మిరియాలూ నూరుతున్న సంగతి తెలిసిందే! నాడు వైసీపీలో ఉన్న సమయంలో బాలినేని చేసిన పనులకు సమాధానం చెప్పేవరకూ వదిలే ప్రసక్తే లేదని స్థానిక టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి. జనసేనలో కొంతమంది నేతలు ఇప్పటికీ బాలినేనికి దూరంగా ఉంటారని అంటుంటారు.

బాలినేని విషయంలో పరిస్థితులు ఇలా ఉంటే... చంద్రబాబు ముందు అతని కోసం పవన్ కల్యాణ్ ఓ సిఫార్సు చేశారనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఏపీలోని కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ తో పాటు ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిలో పవన్, దుర్గేష్ లు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కాగా.. నాదేండ్ల మనోహర్.. కమ్మ!

ఈ సమయంలో మిగిలిన సామాజికవర్గాల సంగతి పక్కనపెడితే.. రెడ్డి వర్గానికి చెందిన వారికి తమ పార్టీ నుంచి కేబినెట్ లో స్థానం ఇవ్వాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేని పేరును చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ సిఫార్సు చేశారని అంటున్నారు. దీంతో.. ఈ సిఫార్స్ పై బాబు స్పందనపైనా ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే ప్రకాశం జిల్లాలోని టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల గతానికీ, వర్తమానానికీ తేడా లేకుండా పోతోందని వారు ఆవేదన చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. దీనిపై స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతల రియాక్షన్ అయితే చెప్పే పనే లేదని అంటున్నారు.

దీంతో... ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారనే విషయం గుర్తు చేసి.. బాలినేని విషయంలో బాబు లైట్ తీసుకుంటారా..? లేక, పవన్ మాట కాదనలేక బాలినేనిని కేబినెట్ లోకి తీసుకుంటారా అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా... ఈ సమయంలో కూటమిలో ఇది సంక్షిష్టమైన సమస్యే అని అంటున్నారు పరిశీలకులు! ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు బాబుకు కొత్తేమీ కాదని అంటున్నారు అభిమానులు!

Tags:    

Similar News