కేంద్రంపై డీఎంకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తుందంటూ..
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష సూపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడుకు చెందిన డీఎంకే మంత్రి తంగం తెనరసు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష సూపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.
గడిచిన కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై ఈ తరహా విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో తెలంగాణకు చెందిన నేతలు కూడా ఇదే తరహాలో విమర్శలు చేశారు. ప్రస్తుతం తమిళనాడుకు చెందిన డీఎంకే నేతలు ఇటువంటి విమర్శలను తరచుగా చేస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందన్న భావన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నాయకుల్లో వ్యక్తం అవుతోంది. ఈ అభిప్రాయాన్ని తాజాగా డీఎంకేకు చెందిన మంత్రి తంగం తేనరసు బహిరంగంగా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 31.5 కోట్ల జనాభా ఉందన్నారు. ఈ రాష్ట్రాలకు రూ.27,336 కోట్ల రూపాయలను మాత్రమే పన్నులకు సంబంధించిన వాటాను కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. అదే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 44.3 కోట్ల జనాభా ఉందని, ఆయా రాష్ట్రాలకు మాత్రం భారీగా నిధులను కేంద్రం కేటాయిస్తుందన్నారు. తాజాగా ఉత్తరాదికి చెందిన ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.62,024 కోట్ల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసిందని పేర్కొన్నారు.
దక్షిణాదికి 15% నిధులను మాత్రమే కేటాయించగా.. ఉత్తరాదికి చెందిన ఈ మూడు రాష్ట్రాలకే 40 శాతం నిధులు ఇవ్వడం వివక్ష కాదా.? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను తమ బిడ్డలు మాదిరిగా చూసుకోవాల్సి ఉందని, కానీ అటువంటి విధంగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూడడం లేదని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాలపై అమితమైన ప్రేమను చూపిస్తూ, దక్షిణాది రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తుందంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూడడం మానేయాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం డీఎంకేకు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వేలాదిమంది మంత్రి వ్యాఖ్యల వీడియోలను సర్కులేట్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతును ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా వ్యవహరించాలని, అందుకు అనుగుణంగా నిధులను కేటాయించాలన్న డిమాండ్ వ్యక్తం అవుతుంది.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి పట్ల ఇప్పుడే కాదు గతంలో కూడా విమర్శలు వ్యక్తం అయ్యాయి. గతంలోనూ వివిధ పార్టీలకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతను ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్న విమర్శలను కేంద్రం మూటగట్టుకుంటుంది. ఈ తరహా ఆరోపణలు ఎప్పటినుంచో వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా తమిళనాడుకు చెందిన మంత్రి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్రంలోని మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బిజెపి నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం మాత్రం తాము అన్ని రాష్ట్రాలకు నిధులను సమానంగానే అందిస్తున్నామని, అన్ని రాష్ట్రాల అభివృద్ధి తమ లక్ష్యమని అందరం పేర్కొంటూ ఉంది.