ఏపీ మంత్రికి చేటు తెచ్చిన ఒకే ఒక్క మాట.. కట్ చేస్తే!
నోరు తిన్నగా లేకపోతే.. ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. నాయకులకు అయితే.. కొంత, మంత్రుల స్థానం లో ఉన్న వారు మరికొంత .. జాగ్రత్తగా ఉండాలి.
నోరు తిన్నగా లేకపోతే.. ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. నాయకులకు అయితే.. కొంత, మంత్రుల స్థానం లో ఉన్న వారు మరికొంత .. జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఏపీలో మాత్రం దూకుడుగా ఉంటున్న ఒకరిద్దరు నేతలు.. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్టు అవుతోంది. తాజాగా యువ మంత్రికి ఇలాంటి పరిస్థితే ఎదురైం ది. ప్రపంచ పెట్టుబడుల సదస్సు కోసం దావోస్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబు టీంలో చేరేందుకు ఎంతో మంది ఎదురు చూశారు. కానీ, మంత్రి నారా లోకేష్(ఐటీ శాఖ), మరో మంత్రి టీజీ భరత్(పరిశ్రమల శాఖ)లకు మాత్రమే అవకాశం చిక్కింది.
మరి అలాంటి సదస్సుకు... పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు వెంట వెళ్లే అవకాశం దక్కడమే మహద్భాగ్యంగా మిగిలిన మంత్రులు భావిస్తున్న సమయంలో టీజీ భరత్ నోటికి పని చెప్పి చేటు తెచ్చుకున్నారు. తొలి రోజు తెలుగు ఎన్నారైలతో జ్యూరిచ్‌లో నిర్వహించిన సదస్సులో మంత్రి భరత్ మాట్లాడుతూ.. నారా లోకేష్.. ఎవరు కాదన్నా ఔనన్నా.. ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన సమయాసమయాలు చూసుకోకుండా చేసిన ఈ వ్యాఖ్యలు.. చేటు తెచ్చాయి.
భరత్ దూకుడును అప్పుడే అడ్డుకున్న చంద్రబాబు.. సమయం, సందర్భం లేకుండా ఈ వ్యాఖ్యలు ఏంటని మండి పడ్డారు. నిజానికి అప్పటికే డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో వివాదాలు తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. దీని నుంచి అంతో ఇంతో బయటపడుతున్న సమయంలో ఏకంగా భరత్ `సీఎం` అంటూ వ్యాఖ్యానించడం.. అది కూడా అంతర్జాతీయ వేదికపై.. పెట్టుబడుల కోసం వచ్చిన సమయంలో కావడంతో చంద్రబాబుకు చిర్రెత్తింది. దీంతో ఆయనను గట్టిగానే మందలించారు.
కట్ చేస్తే..
చంద్రబాబు మందలింపుతో హర్ట్ అయిన మంత్రి టీజీ భరత్.. మంగళవారం.. అంటే రెండో రోజు సమావే శాలకు దూరంగా ఉన్నారు. తమకు కేటాయించిన బసలోనే ఆయన ఉండిపోయారు. నిజానికి మంగళ వారం ఆయన మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఏఐ సహా.. ఇతర సదస్సుల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ, దూరంగా ఉండిపోయారు. ఇక, ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. అనునయించారు. దీంతో బుధవారం నాటి సదస్సులో పాల్గొంటానని భరత్ చెప్పినట్టు సమాచారం. మొత్తానికి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక పోతే.. ఇలాంటి కష్టాలు తప్పవన్నమాట!!