మంత్రి ఆర్కే రోజా టంగ్ స్లిప్.. పోలీసులకు ఫిర్యాదు
రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఏ మాత్రం కనికరం లేకుండా మాటలతో ఉతికి ఆరేసే అలవాటున్న ఆర్కే రోజా.. తాజాగా తన మాటల్లో నోరు జారి మాట అనేశారు.
గతానికి వర్తమానానికి మార్పు ఎంతో వచ్చేసింది. ఎవరికి వారు.. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవటం.. తమ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా రియాక్టు అవుతున్న పరిస్థితి. మారిన పరిస్థితుల నేపథ్యంలో గడిచిన కొన్నేళ్లుగా నేతల మాటల్లో తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినంతనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఈ తరహా ఇష్యూలో ఫైర్ బ్రాండ్ నేత కమ్ ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇరుక్కున్నారు.
రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఏ మాత్రం కనికరం లేకుండా మాటలతో ఉతికి ఆరేసే అలవాటున్న ఆర్కే రోజా.. తాజాగా తన మాటల్లో నోరు జారి మాట అనేశారు. ఇటీవల ఆమె మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ సామాజిక వర్గాన్ని ఎలా కించపరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆమె మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తన క్రిష్ణా జిల్లా పర్యటనలో భాగంగా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. నారా లోకేశ్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్.. లోకేశ్ లను విమర్శించే వేళ.. ఇద్దరిని బుడబుక్కల వారితో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావటం.. ఆమె వ్యాఖ్యలపై పెనుగంచిప్రోలు బుడబుక్కల సంఘం వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా ఆ సంఘ అధ్యక్షుడు ఎర్ర అబ్బాయితో కలిసి పలువురు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు మంత్రి ఆర్కే రోజాకు ఎవరు ఇచ్చారు? అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం నుంచి మంత్రి రోజా ఎంత త్వరగా బయటపడితే.. అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. మరే చేస్తారో చూడాలి.