విశాఖ ఎంపీగా ఆ మంత్రి సతీమణి!

తనకు బదులుగా తన సతీమణి బొత్స ఝాన్సీని విశాఖపట్నం ఎంపీగా ఎంపిక చేయాలని కోరినట్టు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు వైఎస్‌ జగన్‌ సైతం ఓకే చెప్పినట్టు చెబుతున్నారు.

Update: 2024-01-07 06:02 GMT

బొత్స సత్యనారాయణ.. పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఓవైపు తాను విద్యా శాఖ మంత్రిగా, తన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా, ఇంకో బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేనా... బొత్స మేనల్లుడు చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా ఉన్నారు. ఇలా బొత్స కుటుంబం విజయనగరం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది.

కాగా ఇప్పుడు ఒక వార్త ఏపీ రాజకీయాల్లో హల్చల్‌ చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ గా కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ప్రాంతీయ సమన్వయకర్తగా ఉత్తరాంధ్ర జిల్లాలపై బొత్స దృష్టి సారించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన తన నియోజకవర్గమైన చీపురుపల్లిపైన అంతగా దృష్టి సారించే సమయం ఉండకపోవచ్చని చెబుతున్నారు.

ఈ పరిణామాల మధ్య బొత్స సత్యనారాయణను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. బొత్స ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి ఆయన మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చిన్న శ్రీను పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సైతం బొత్సను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరినట్టు చెబుతున్నారు.

అయితే ఆయన తాను చీపురుపల్లి నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేసినట్టు సమాచారం. తనకు బదులుగా తన సతీమణి బొత్స ఝాన్సీని విశాఖపట్నం ఎంపీగా ఎంపిక చేయాలని కోరినట్టు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు వైఎస్‌ జగన్‌ సైతం ఓకే చెప్పినట్టు చెబుతున్నారు.

కాగా గతంలో బొత్స ఝాన్సీ విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా 2001 నుంచి 2006 వరకు పనిచేశారు. 2004లో బొబ్బిలి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో గెలుపొంది 2007–09 వరకు బొబ్బిలి ఎంపీగా ఉన్నారు. 2009లో విజయనగరం ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో బొత్స ఝాన్సీని విశాఖపట్నం నుంచి బరిలోకి దించితే ఒక మహిళకు అందులోనూ బీసీ మహిళకు సీటు ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ లెక్కలేసుకుంటోంది. అందులోనూ బొత్స తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారు. విశాఖపట్నం పార్లమెంటరీ పరిధిలో కాపు సామాజికవర్గం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఆర్థిక, అంగ బలాల పరంగానూ ఆమెకు ఎలాంటి ఢోకా లేకపోవడంతో విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమేనని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News