జగన్‌ కు అత్యంత సన్నిహితుడు ఎంపీ పదవిపై వైరాగ్యం!

వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2019, 2024 ఎన్నికల్లో రాజంపేట లోక్‌ సభా స్థానంలో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-16 11:15 GMT

వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2019, 2024 ఎన్నికల్లో రాజంపేట లోక్‌ సభా స్థానంలో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి ముచ్చటగా మూడు పర్యాయాలు ఘనవిజయం అందుకున్నారు. తద్వారా హ్యాట్రిక్‌ సృష్టించారు.

2014లో రాజంపేట ఎంపీ సీటును పొత్తులో భాగంగా టీడీపీ.. బీజేపీకి కేటాయించింది. దీంతో ప్రస్తుత బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజంపేట నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఆమెపై వైసీపీ అభ్యర్థి మిథున్‌ రెడ్డి 1,74,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

ఇక 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. ఈసారి టీడీపీ తరఫున దివంగత ఎంపీ డీకే ఆదికేశవులనాయుడి సతీమణి డీఏ సత్యప్రభ పోటీ చేశారు. అయితే ఆమెపై మిథున్‌ రెడ్డి 2,68,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఇటీవల 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ.. రాజంపేట సీటును మరోసారి బీజేపీకి కేటాయించింది. బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ తరఫున పోటీ చేసిన మిథున్‌ రెడ్డి మూడోసారి విజయం సాధించారు. దీంతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు.

మిథున్‌ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌ కు కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌ గా మిథున్‌ రెడ్డే ఉన్నారు. అలాగే వైసీపీ లోక్‌ సభా పక్ష నేతగానూ మిథున్‌ చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత జగన్‌ ప్రభుత్వంలో నంబర్‌ టూ మంత్రిగా హవా చలాయించారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించి రాయలసీమ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికలో ఆయనే కీలక పాత్ర పోషించారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తండ్రీకొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డిలకు కష్టాలు మొదలయ్యాయి. తిరుపతిలో నివాసం ఉంటున్న వీరు తమ నియోజకవర్గమైన పుంగనూరులో కాలుపెట్టలేకపోతున్నారు. రెండుసార్లు పుంగనూరులో పర్యటించడానికి ప్రయత్నించినా టీడీపీ నేతలు అడ్డుకున్నారు.

మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాది ఎకరాలను ఆయన బందువులు, అనుచరులు, వైసీపీ నేతలు కబ్జా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన రికార్డులు మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో అనుమానాస్పద పరిస్థితుల్లో కాలిపోయాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్‌ ను ఏర్పాటు చేసింది. దస్త్రాలు కాలిపోయిన వ్యవహారంలో పలువురు అధికారులను సస్పెండ్‌ చేసింది.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పుంగనూరు నియోజకవర్గాన్ని పునర్విభజిస్తారనే వార్తల నేపథ్యంలో తాజాగా మాట్లాడిన మిథున్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే పుంగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. టీడీపీ నేతలు పుంగనూరును అభివృద్ధి చేస్తే వారిని తానే సన్మానిస్తానని తెలిపారు. పుంగనూరు పునర్విభజనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు.

వక్ఫ్‌ బోర్డు బిల్లును లోక్‌ సభలో అడ్డుకుంటామన్నారు. ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఆ బిల్లుకు వైసీపీ ఆమోదం తెలపదని చెప్పారు. కాగా పుంగనూరు ఎమ్మెల్యేగా మిథున్‌ రెడ్డి పోటీ చేస్తే మరి ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News