మిథున్ రెడ్డి ప్రత్యర్థి ఫిక్స్... విపక్షాల ఉమ్మడి వ్యూహం ఇదే?

Andhrapradesh,Mithunreddy,Politics,Assemblyelections,Peddireddyramachandrareddy,Rajampet,Politicalnews

Update: 2023-09-28 09:59 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పార్టీల వ్యూహాలు, అంచనాలు, అభ్యర్థుల ఎంపికలో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పైగా మనం గెలవకపోయినా పర్లేదు అధికారపార్టీ అభ్యర్థి ఓడిపోవాలనే లక్ష్యంతో విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కి ప్రత్యర్థి ఫిక్సయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.

అవును.. రానున్న ఎన్నికలు ప్రధాన పార్టీల భవిష్యత్ కు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. పైగా కొన్ని పార్టీలకు రాబోయే ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రతీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి. కంచుకోట అని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు 2019 ఎన్నికలతోనే పోయాయి. ఈ సమయంలో వైసీపీలో కీలక ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి ప్రత్యర్థి ఫిక్సయ్యారని అంటున్నారు.

ఇందులో భాగంగా... విపక్షాల పొత్తులు ఏ రూపంలో ఉన్నా ఈయనే ప్రత్యర్థి అంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. దీంతో ఈసారి రాజంపేట లోక్ సభ స్థానం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తురు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఈసారి కుప్పంలో ఓడించాలని అధికార వైసీపీ బలంగా ఫిక్సయ్యిందని అంటున్నారు.

దీంతో ఈసారి బాబుకు ఓటమి రుచి చూపించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారని.. ఆ దిశగా ఇప్పటికే కుప్పంలో చాపకింద నీరులా పనులు చేసుకుంటూపోతున్నారని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... రాజంపేట లోక్ సభ స్థానం నుంచి ఈ సారి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. జనసేన - బీజేపీ పొత్తు అయినా.. మూడు పార్టీల పొత్తు అయినా.. ఈ సీటుపై పూర్తిగా ఆయన టార్గెట్ చేశారని చెబుతున్నారు. దాని వెనుక ఒక బలమైన కారణం, నమ్మకం ఉన్నాయని తెలుస్తుంది.

రాజంపేట లోక్ సభ స్థానానికి వైసీపీ తరుపున మిథున్ రెడ్డి రెండు సార్లు పోటీచేసి గెలిచారు. 2014లో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై 1,74,762 మెజారిటీతో గెలిచిన ఆయన... 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభ పై 2,68,284 భారీ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దిగాలని భావిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.

రాజంపేట లోక్‌ సభ పరిథిలో రాజంపేట, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, రైల్వే కోడూరు, మదనపల్లి, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువ. దీంతో పార్టీ పరంగా బీజేపీకి మద్దతు లేకపోయినా కిరణ్ కుమార్ రెడ్డికి వ్యక్తిగతంగా మద్దతు ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ-జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నందున బలిజవర్గం సపోర్ట్ కూడా దక్కుతుందని భావిస్తున్నారు.

ఇదే సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని ప్రకటించిన పవన్ కల్యాణ్ మాటే ఫైనల్ అయితే... బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి రావొచ్చు! అయినాకూడా వైసీపీ గెలవకపోతే చాలు అనే సూత్రంలో భాగంగా టీడీపీ, జనసేనలు కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి పరోక్షంగా మద్దతు తెలిపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

దీంతో... ఈసారి రాజంపేట లోక్ సభ స్థానం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారబోతోందని అంటున్నారు. ఏది ఏమైనా... ఈసారి జరగబోయే ఎన్నికలు మాత్రం చరిత్రలో మరింత చిరస్థాయిగా నిలిచిపోతాయని.. ఆ ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రం మాగ్జిమం మారిపోబోతోందని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News