కొత్త జంటలూ పిల్లల్ని కనేయండి..తమిళ ప్రజలకు స్టాలిన్ పిలుపు
1990ల్లో ప్రభుత్వాలు విపరీతంగా ప్రచారం చేసిన ‘జనాభా నియంత్రణ’ డిమాండ్ ఇప్పుడు పక్కకు పోయింది. ‘సాధ్యమైనంత పిల్లల్ని కనేయండి’ అనే సూచన ముందుకొస్తోంది;
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది, ఉత్తరాది అగ్గి రాజేస్తూ మంటలు రేపేలా ఉంది.. దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవు అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినా తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం దానిని నమ్మడం లేదు. 1990ల్లో ప్రభుత్వాలు విపరీతంగా ప్రచారం చేసిన ‘జనాభా నియంత్రణ’ డిమాండ్ ఇప్పుడు పక్కకు పోయింది. ‘సాధ్యమైనంత పిల్లల్ని కనేయండి’ అనే సూచన ముందుకొస్తోంది.
1990ల నాటి కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు జనాభా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేయలేకపోయాయి. ఇప్పుడ లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు వచ్చేసరికి అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న అంచనా వస్తోంది. దీంతోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొంతకాలంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
డెవలప్ మెంట్, దేశ ప్రగతిని కాంక్షించి తాము జనాభా నియంత్రణ పాటించామని, ఇపుడు జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే తమిళనాడులో లోక్ సభ స్థానాలు తగ్గుతాయనేది స్టాలిన్ వాదన.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లలను కనాలని కోరారు. నాగపట్నంలో స్టాలిన్ మాట్లాడుతూ కొత్తగా పెళ్లైనవారు కొంత సమయం తీసుకోవాలని గతంలో తానే సూచించామని.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. కారణం.. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికలేనని అన్నారు. జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లామన్నారు. ఇటీవల మరో కార్యక్రమంలోనూ స్టాలిన్ మాట్లాడుతూ ‘తక్కువమంది పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామని.. దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది’ అని వ్యాఖ్యానించారు. డీ లిమిటేషన్ దుష్ప్రభావాలపై చర్చిం చేందుకు స్టాలిన్ ఈ నెల 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 40 పైగా పార్టీలను ఆహ్వానించారు.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఏడాది మొదలుకానుంది. దీనికి జనాభా ప్రామాణికత అయితే తమిళనాడులో 8 నియోజకవర్గాలు తగ్గుతాయని స్టాలిన్ వాదిస్తున్నారు.