బీజేపీ తరఫున ఎన్నికల్లో ఈడీ పోటీ: తమిళనాడు సీఎం సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ని గెలిపించేందుకు ఇప్పటి నుంచే ఈడీ అధికారులు రంగం లోకి దిగారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కేంద్రం పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించేందుకు ఇప్పటి నుంచే ఈడీ అధికారులు రంగం లోకి దిగారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విపక్ష పార్టీల నాయకులపైనా, మంత్రులపైనా ఈడీ, సీబీఐ ని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. బెంగళూరు లో జరుగుతున్న విపక్ష నాయకుల భేటీ అంశాన్ని ప్రజల దృష్టి నుంచి మరలించేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఈడీని తమిళనాడు లో మోహరించిందని వ్యాఖ్యానించారు. తమిళనాడు గవర్నర్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారని, ఇప్పుడు ఈడీ కూడా బరి లోకి దిగిందని ముఖ్యమంత్రి మండి పడ్డారు.
అసలు ఏం జరిగిందంటే!
ఈ నెల 18(మంగళవారం) కేంద్రం లోని బీజేపీ సర్కారు నేతృత్వంలో ఎన్డీయే కూటమి సమావేశం ఉంది. ఈ క్రమంలో తమతో చేతులు కలపాల ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 10 రోజుల కిందటే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కు లేఖ రాశారు.
అయితే.. దీని పై తీవ్రస్థాయి లో మండిపడ్డ డీఎంకే.. తాము మతతత్వ శక్తుల తో చేతులు కలిపేది లేదని.. వ్యాఖ్యానించారు. ఇక, ఎన్డీయే సమావేశానికి అన్నా డీఎంకే వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చింది. మరోవైపు ఉమ్మడి పౌరస్మృతి సహా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి వచ్చే పార్టీల కు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది.
కానీ, డీఎంకే చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేయడంతో అనూహ్యంగా డీఎంకే మంత్రి పొన్‌ముడి, ఆయన కుటుంబ సభ్యుల పై సోమవారం ఉదయం నుంచి ఈడీ అధికారులుదాడులు చేస్తున్నారు. మంత్రి కార్యాలయం, నివాసం, ఆయన కుమారుడు(ఎంపీ) సహా బంధువుల ఇళ్లలోనూ ఏకకాలం లో దాడులు ప్రారంభించారు. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఈ దాడులు చేయిస్తోందని సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. అయినప్పటికీ.. తాము లొంగేది లేదని తేల్చి చెప్పారు. పొన్‌ముడి వ్యవహారాన్ని కోర్టు లోనే తేల్చుకుంటామని చెప్పారు.