హే 'గాంధీ'.. ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారట

ఇదే సమయంలో అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ గా శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది.

Update: 2024-09-10 09:56 GMT

తెలంగాణ రాజకీయం రసపట్టులో పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏం జరగనుందో అనే ఆసక్తి నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయమై నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలని హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సంబంధిత ఫైళ్లను స్పీకర్ ముందుంచాలని కూడా సూచించింది. వాటిని తమకూ ఇవ్వాలని కోరింది. లేదంటే సుమోటోగా తీసుకుని తిరిగి విచారణ చేపడతామని తీర్పుచెప్పింది. ఇదే సమయంలో అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ గా శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. దీనిప్రకారం..

అది ప్రతిపక్ష నేత పదవి..

అసెంబ్లీ పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయిస్తారు. ఆ ప్రతిపక్షం నుంచి సీనియర్ నాయకుడిని పీఏసీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. ఇక్కడే స్పీకర్ కార్యాలయం ఏం చేయనున్నదో అర్ధం అవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత సంగతి విషయంలో హైకోర్టు ఆదేశాలుండగా.. స్పీకర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. దీనిప్రకారం.. పార్టీ ఫిరాయించినప్పటికీ వారిని ప్రతిపక్ష (బీఆర్ఎస్) సభ్యులుగానే గుర్తించనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు అరికెపూడి గాంధీ.

విపక్షంలోనే ఉన్నా.. ఇదే నా సవాల్..

తాను ప్రతిపక్షంలో ఉన్నందుకే పీఏసీ పదవి ఇచ్చారని.. దీనిపై విమర్శలు చేసేవారికి దమ్ముంటే చర్చకు రావాలని గాంధీ సవాల్ చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండగా చేసిందేమిటని ప్రశ్నించారు. మరోవైపు తాను కాంగ్రెస్ లో చేరలేదని.. సీఎం రేవంత్ ను కలిసినప్పడు ఆ పార్టీ కండువా కప్పుకోలేదని అంటున్నారు గాంధీ. తనకు కప్పింది ఓ ఆలయానికి సంబంధించిన శాలువానే అని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ తరఫున గెలిచినా.. అభివృద్ధి కోసం రేవంత్ తో కలిసి నడుస్తానని చెప్పారు.

పార్టీ మారలేదంటూనే.. సొంత పార్టీ వారిపై విమర్శలు ఓవైపు తాను పార్టీ (బీఆర్ఎస్) మారలేదని అంటూనే.. సొంత పార్టీ వారిపైనే విమర్శలకు దిగారు అరికెపూడి గాంధీ. బీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా? వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా? అంటూ ప్రశ్నించారు. మరి దీని అర్థం ఏమిటో?

Tags:    

Similar News