శ్రీకిరణ్ ఆత్మహత్యకు దర్శకుడు కల్యాణ్ కృష్ణ కి సంబంధం లేదు!
తన కుమారుడు మరణానికి కారణం ఎమ్మెల్యే సోదరుడే అంటూ బాధితుడి తల్లి ఆరోపించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తనకు సంబంధం లేని వ్యవహారంలో మాజీ మంత్రి కమ్ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు చిక్కుకున్నారు. ఆయన సోదరుడు కమ్ సినీ దర్శకుడైన కల్యాణ్ క్రిష్ణకు మరో వ్యక్తికి మధ్య నడుస్తున్న భూవివాదం పలు మలుపులు తిరగటం.. తాజాగా ఒకవ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం షాకింగ్ గా మారింది. తన కుమారుడు మరణానికి కారణం ఎమ్మెల్యే సోదరుడే అంటూ బాధితుడి తల్లి ఆరోపించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ మొత్తం వ్యవహారం రాజకీయ రంగును పులుముకోవటంతో ఒక ఎత్తు అయితే.. ఆత్మహత్య ఉదంతంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు, ఆయన సోదరుడు స్పష్టం చేస్తున్నారు. కాకినాడలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. వారు సైతం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. తమపై వస్తున్న విమర్శల్ని పోలీసులు కొట్టేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్న శ్రీకిరణ్ కుటుంబ సభ్యుల కథనం ఇలా ఉంది. శ్రీకిరణ్ రష్యాలో మెడిసిన్ చేసేవారు. కొవిడ్ టైంలో అతడి తండ్రి మరణించటంతో రష్యా నుంచి స్వదేశానికి వచ్చేశారు. బాధితుడి కుటుంబానికి గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద 12.5 ఎకరాల భూమి ఉంది. ఇందులో 5 ఎకరాల విషయంలో వివాదం నడుస్తోంది. మరో 6 ఎకరాలను సామర్లకోట మండలంలోని వేట్లపాలెంకు చెందిన ఒక వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి రూ.50లక్షల అప్పు తీసుకొచ్చారు. తండ్రి మరణం తర్వాత ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత శ్రీకిరణ్ మీద పడింది.
దీంతో అతడు ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కమ్ సినీ దర్శకుడు కల్యాణ్ ను సంప్రదించాడు. వివాదంలో ఉన్న 5 ఎకరాలను కొనేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు గాను ఎకరం రూ.30 లక్షలకు అమ్మేలా డీల్ జరిగింది. అడ్వాన్సులో భాగంగా కిరణ్ కు కొంత సొమ్ము ఇచ్చారు. అయితే.. ఆ తర్వాత జరగాల్సిన పనులు జరగలేదు. శనివారం వెళ్లి అడగ్గా.. బ్యాలెన్సు మొత్తం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సోదరుడు తనకు చెప్పినట్లుగా ఇరువురి మధ్య ఉన్న మధ్యవర్తి చెప్పటంతో తీవ్రమైన ఆందోళనతో కిరణ్ సూసైడ్ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తమ్ముడు కల్యాణ్ క్రిష్ణ తన కొడుకు వద్ద భూమి పత్రాల్ని తీసుకున్నాడని.. డబ్బులు అడిగితే ఇవ్వమని చెప్పారన్నారు. తన కొడుకు చదువు మానేసి కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడని.. అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే తమ్ముడు మనుషులు గొడవ చేయటం వేదనకు గురైనట్లుగా చెబుతున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే కన్నబాబు దగ్గర ఉండే బాలాజీ అనే వ్యక్తి కూడా మరో భూమికి సంబంధించి ఇవ్వాల్సిన రూ.29 లక్షలు ఇవ్వలేదని.. దాన్ని సెటిల్ చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే సోదరుడు ఆ విషయంలోనూ ఏమీ చేయలేదని మ్రతుడి తల్లి ఆరోపించారు.
ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. ఉదయం ఇదంతా చెప్పిన శ్రీకిరణ్ తల్లి శేషారత్నం సాయంత్రం అయ్యే సరికి మాట మార్చేయటం.. తన కొడుకు ఆత్మహత్యకు ఎమ్మెల్యే కన్నబాబు.. ఆయన తమ్ముడు కల్యాణ్ కు ఏ మాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. తన కొడుకు స్నేహితులు చెప్పటంతో తాను అలా చెప్పానని పేర్కొన్నారు. తన తల్లికి వైద్యం చేయించటం కోసం తమ భూమిని కొనుక్కోవాలని బతిమిలాడితే తన తమ్ముడు జాలి పడి కొనేందుకు సిద్ధమయ్యాడని.. అయితే.. అప్పటికే ఆ భూమిని మరొకరికి అమ్మేశారని తెలిసినట్లు చెప్పారు. శ్రీకిరణే తన తమ్ముడ్నిమోసం చేసినట్లుగా చెప్పిన ఎమ్మెల్యే కన్నబాబు.. తమకే వారి నుంచి డబ్బులు రావాలని చెప్పటం గమనార్హం. అయితే.. ఈ వాదనపై నారా లోకశ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే.. అతడి సోదరుడి భూదందాలకు బలైనట్లుగా ఆరోపించారు.