ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు ఎంత చేయొచ్చంటే..!
ఆఫ్ ద రికార్డ్ చెప్పుకునే ఆవేదనల సంగతి కాసేపు పక్కనపెడితే... ఒక్కో అభ్యర్థి ఎన్నికల్లో ఎంతెంతె ఖర్చు పెట్టొచ్చు అనే విషయాలపై లెక్కలు వివరించింది, ధరల పట్టీ విడుదల చేసింది.
ఎన్నికలు అంటే అబ్బో ఖర్చు తడిసి మోపెడవుతుందని అంటుంటారు.. అది అత్యంత భారంతో కూడిన పని అని చెప్పేవారూ లేకపోలేదు. ఆ అనధికారిక మాటల సంగతి, ఆఫ్ ద రికార్డ్ చెప్పుకునే ఆవేదనల సంగతి కాసేపు పక్కనపెడితే... ఒక్కో అభ్యర్థి ఎన్నికల్లో ఎంతెంతె ఖర్చు పెట్టొచ్చు అనే విషయాలపై లెక్కలు వివరించింది, ధరల పట్టీ విడుదల చేసింది.
అవును... అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులను లెక్కించడంపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా... బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు.. కార్యకర్తలకు కాఫీ, టిఫిన్, బిర్యానీల కోసం చేసే ఖర్చును సక్రమంగా చూపించేలా ధరల జాబితాను రూపొందించారు. ఆ లిస్టు ప్రకారమే అభ్యర్థి ఖర్చులను లెక్కకట్టనున్నారు.
అయితే... గతంలో ఈ వివరాలు తప్పుగా చూపించేవారనే ఫిర్యాదులు బలంగా అందాయని చెబుతుంటారు. ఆ ఫిర్యాదులన్నింటినీ, గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ గుర్తుపెట్టుకున్న ఎన్నికల కమిషన్... ఈ దఫా... వాటర్ ప్యాకెట్ నుంచి సమావేశాల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్ఈడీ స్క్రీన్ల వరకూ ధరలు నిర్ణయించింది.
ఇందులో భాగంగా... ఒక్కో బెలూన్ కు రూ.4 వేలు, ఎల్‌ఈడీ స్క్రీన్ కు రూ.15 వేలను రోజు అద్దెగా అధికారులు పరిగణిస్తారు. ఇదే సమయంలో... ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహిస్తే టౌన్లలో అయితే 15 వేల రూపాయలు అభ్యర్థి తన ఖర్చులో నమోదు చేయాలి. ఎలక్షన్ కమిషన్ కు సదరు అభ్యర్థి సమర్పించే ఎన్నికల ఖర్చులో కుర్చీలు, టేబుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలూ ఉండాలని ఈసీ స్పష్టం చేసింది.
వాస్తవానికి ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుకూ, చూపించే ఖర్చుకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంటుందనే మాటలు నిత్యం వినిపిస్తుంటాయి. దీంతో... ఈ వ్యయ పరిమితిని పెంచితే కొంతైనా అక్రమాలకు అడ్డకుట్ట వేయోచ్చని కేంద్ర ఎన్నికల సంఘం భావించిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే... అభ్యర్థుల ఖర్చును 2022లో పెంచింది.
2014లో ఎంపీ అభ్యర్థి వ్యయ పరిమితి గరిష్ఠంగా రూ.75 లక్షలు ఉండగా.. 2022లో ఆ మొత్తాన్ని రూ.90 లక్షలకు పెంచింది. ఇదే క్రమంలో... ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో పెరిగిన ఓటర్ల సంఖ్య, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యయ పరిమితిని పెంచిందని తెలుస్తుంది.
ఈసీ తన జాబితాలో పేర్కొన్న ధరల వివరాలు..!
డీసీఎం వ్యాన్ రోజుకు - పట్టణాల్లో రూ.3000 - గ్రామాల్లో రూ. 3000
మినీ బస్సూ రోజుకు - పట్టణాల్లో రూ.3500 - గ్రామాల్లో రూ. 3500
ఇన్నోవా కారు రోజుకు - పట్టణాల్లో రూ.4000 - గ్రామాల్లో రూ. 4000
పెద్ద బస్సు రోజుకు - పట్టణాల్లో రూ.6000 - గ్రామాల్లో రూ. 6000
బెలూన్ రోజుకు - పట్టణాల్లో రూ.4000 - గ్రామాల్లో రూ. 4000
డ్రోన్ కెమెరా రోజుకు - పట్టణాల్లో రూ.5000 - గ్రామాల్లో రూ. 5000
ఫంక్షన్ హాల్ రోజుకు - పట్టణాల్లో రూ.15000 - గ్రామాల్లో రూ. 12000
ఎల్ఈడీ స్క్రీన్ రోజుకు - పట్టణాల్లో రూ.15000 - గ్రామాల్లో రూ. 15000
టిఫిన్ ఒక పూట - పట్టణాల్లో రూ. 35 - గ్రామాల్లో రూ. 30
భోజనం ఒక పూట - పట్టణాల్లో రూ. 80 - గ్రామాల్లో రూ. 80
వెజిటబుల్ బిర్యానీ - పట్టణాల్లో రూ. 80 - గ్రామాల్లో రూ. 70
చికెన్ బిర్యానీ - పట్టణాల్లో రూ. 140 - గ్రామాల్లో రూ. 100
మటన్ బిర్యానీ - పట్టణాల్లో రూ. 180 - గ్రామాల్లో రూ. 150