స్పీడ్ పెంచిన రేవంత్... బీఆరెస్స్ కు మరో బిగ్ షాక్!
ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.
బీఆరెస్స్ కు షాకులు ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి గ్యాప్ ఇవ్వడం లేదు. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు! అసెంబ్లీలో బీఆరెస్స్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లున్నారు. ఈ క్రమంలోనే బీఆరెస్స్ నేతలకు వరుసపెట్టి కాంగ్రెస్ కండువాలు కప్పేస్తున్నారు. ఈ సమయంలోనే తాజాగా మరో ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.
అవును... శనివారం (జూన్ 22)న మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్స్ ఎమ్మెల్యే, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా రేవంత్ రెడ్డి.. పోచారం ఇంటికెళ్లిమరీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కారు దిగిపోయారు.
ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. దీంతో... బీఆరెస్స్ కు మరో షాక్ తగిలినట్లయ్యింది. బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు సన్నిహితంగా మెలిగే సంజయ్.. ఇటువంటి ట్విస్ట్ ఇస్తారని బీఆరెస్స్ శ్రేణులు ఊహించి ఉండరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... బీఆరెస్స్ నుంచి రెండు సార్లు బరిలోకి దిగిన డాక్టర్ సంజయ్ కుమార్... రెండు సార్లూ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిపై గెలుపొందారు. ఈ నేపథ్యంలో... పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికపైనే బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. సంజయ్ చేరికపై ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.