పెనుకొండ ఎమ్మెల్యేపై డిటోనేటర్ తో దాడి.. అసలేమైందంటే?

ఏపీలోని అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే కారుపై బండలు పేల్చే డిటోనేటర్ తో దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది

Update: 2023-10-09 05:10 GMT

ఏపీలోని అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే కారుపై బండలు పేల్చే డిటోనేటర్ తో దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. అయితే.. డిటోనేటర్ పేలకపోవటం.. ఈ ఘటన జరిగిన సమయానికి కాస్త ముందే.. పెనుకొండఎమ్మెల్యే వాహనం నుంచి బయటకు వచ్చేయటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఉదంతాన్ని గమనించిన స్థానికులు మాత్రం భయాందోళనలకు గురయ్యారు. డిటోనేటర్ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఆదివారం గడ్డంతండా పంచాయితీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ. ఆయనతో పాటు పలు వాహనాల్లో మిగిలిన పార్టీ నేతలు.. అనుచర వర్గం భారీగా చేరుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాము వెళ్లాల్సిన గడ్డంతండాకు కాలినడకన వెళ్లేందుకు కళ్లితండ వద్ద వాహనాల్ని నిలిపారు.

ఎమ్మెల్యే.. ఆయన అనుచరులు కారు దిగి కాస్త దూరం నడిచిన సమయంలోనే.. ఒక వ్యక్తి బండలు పగలగొట్టే డిటోనేటర్ ను ఎమ్మెల్యే కారుపై విసిరారు. అయితే.. డిటోనేటర్ పేలకపోవటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. అక్కడి సమీపంలో ఉన్న వారు ఈ పరిణామానికి భయపడి పరుగులు తీశారు. స్పందించిన పోలీసులు డిటోనేటర్ ను విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. అతడి పేరు గణేశ్ గా తేల్చారు.

పాలసముద్రం సమీపంలోని ఉన్న ఒక కంపెనీలో అతను ట్రాక్టర్ డ్రైవర్ గా.. రాళ్లు పేల్చే పనులు చేసేవాడని గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మద్యం తాగి విధులకు వెల్లటంతో అక్కడి కాంట్రాక్టర్ అతడ్ని పనులకు అనుమతించకుండా వెనక్కి పంపేశాడు. ఈ క్రమంలోనే ఈ దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం తెలిసినంతనే.. ఘటనాస్థలానికి చేరుకున్నారు జిల్లా ఎస్పీ. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారన్నది తేలాల్సి ఉందని చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

Tags:    

Similar News