మహిళా బిల్లు తెరపైకి రావడం.. ఎమ్మెల్సీ కవిత ప్లస్సా..?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు గనుక వస్తే దానిని ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే వీలుంది.

Update: 2023-09-19 08:50 GMT

ఉరుములు లేని పిడుగులా మహిళా రిజర్వేషన్ బిల్లు తెరపైకి వచ్చింది. 27 ఏళ్లుగా పెండింగ్ లో ఉండి.. 13 ఏళ్ల కిందటే రాజ్యసభలో ఆమోదం పొంది.. తొమ్మిదిన్నరేళ్ల మోదీ సర్కారు పాలనలో పెద్దగా ప్రాధాన్యానికి నోచుకోని ఈ బిల్లు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలు కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెడుతుందా..? అనేది చాలా వరకు సందేహంగానే ఉంది. అయితే, ఆ అనుమానాలు లేకుండా ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. దీంతోనే మహిళా బిల్లు లోక్ సభలోకి రానున్నట్లు స్పష్టమవుతోంది.

మహిళా ప్రతినిధిగా..

సోనియా గాంధీ వంటి శక్తిమంతమైన నాయకురాలి హయాంలో.. యూపీఏ పదేళ్ల పాలనలోనూ చట్టరూపంలోకి రాని మహిళా బిల్లు ఇప్పుడు తుది అంకానికి చేరినట్టే. ఎందుకంటే.. యూపీఏ హయాంలో కాంగ్రెస్ కు లోక్ సభలో పూర్తి మెజార్టీ లేదు. బీజేపీకి నేడు ఆ సమస్య లేదు. కాబట్టి బిల్లు గనుక లోక్ సభలోకి వస్తే ఆమోదానికి అడ్డంకులు లేవని ప్రాథమికంగా భావించాలి. కాగా, మహిళా బిల్లు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పాత్రను చెప్పాల్సి ఉంటుంది.

లిక్కర్ స్కాం ఆరోపణల నడుమ

ఏడాది నుంచి తెలంగాణ, ఢిల్లీ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం ఢిల్లీ లిక్కర్ స్కాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుల పాత్ర పైనా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా మాత్రం కవిత పేరు వినిపించింది. ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం విచారించి నోటీసులిచ్చాయి. ఓ దశలో కవిత తీవ్రంగా ఇరుక్కున్నారన్న కథనాలు వచ్చాయి. వీటి నేపథ్యంలోనే ఆమె అనూహ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చారు.

ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేసి..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమయంలోనే కవిత.. మహిళా బిల్లును ఆమోదించాలంటూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. తను స్థాపించిన జాగ్రతి సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. అంతేకాక.. కవిత నేరగా ఢిల్లీ వెళ్లి మహిళా బిల్లు ఆందోళనలోనూ పాల్గొనడం గమనార్హం.

అనుకూలంగా మలుచుకుంటారా?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు గనుక వస్తే దానిని ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే వీలుంది. ఈ బిల్లుపై తాము ఎప్పటినుంచో కోరుతున్నామని.. చెప్పుకొనే చాన్సుంది. తద్వారా ఎన్నికల ముంగిట మహిళల ఆదరణ పొందేందుకు అవకాశం ఉంటుంది. అన్నిటికి మించి.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు చుట్టుముట్టిన వేళ కవితకు మహిళా బిల్లు ఓ పెద్ద ఉపశమనం. తాను గతంలో మహిళా బిల్లుకు ఆందోళనలు చేసిన నేపథ్యంలో కవిత మానసికంగా కొంత శాటిస్ఫాక్షన్ పొందవచ్చు.

కొసమెరుపు..: మహిళా బిల్లు లోక్ సభలో ఆమోదానికి వచ్చిన సమయంలో కవిత లోక్ సభ సభ్యురాలు కాకపోవడం ఆమెను నిరాశకు గురిచేయొచ్చు. ఎందుకంటే కవిత 2014-19 మధ్య లోక్ సభ సభ్యురాలు. 2019లో ఆమె నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీకి దిగి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఒకవేళ 2019 గెలిచి ఉంటే.. ఇప్పుడు మహిళా బిల్లుకు లోక్ సభకు వచ్చిన చారిత్రక సందర్భంలో కవిత పాత్ర ఉండేది. మహిళా నేతగా ఆమె లోక్ సభలో చేసే ప్రసంగం బీఆర్ఎస్ కు మంచి మైలేజీ ఇచ్చేది.

Tags:    

Similar News