ఉసూరుమనిపించిన మోడీ...ఎందుకలా ?
ఉక్కు మీద ప్రధాని ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు భారీ ప్రదర్శనను కూడా నగరంలో నిర్వహించారు.
ప్రధాని గా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణం చేసిన తరువాత విశాఖ వస్తున్నారు అని అంతా సంతోషించారు. ప్రధాని హోదాలో మోడీ వస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంతా ఆశగా ఎదురుచూశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రధానమంత్రి పూర్తి స్పష్టత ఇస్తారని కూడా భావించారు.
అదే విధంగా విశాఖ సహా ఉత్తరాంధ్రకు కేంద్రం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అన్న దాని మీద కూడా నరేంద్ర మోడీ నోటి వెంట నుంచి మంచి మాటలు నాలుగు వినాలని కూడా ఆశించారు. అయితే నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వాయుగండం అడ్డు పడిపోయింది.
ఈ నెల 29న ప్రధాని విశాఖలో పర్యటించాల్సి ఉంది. రోడ్ షోతో పాటు విశాఖలో ఒక భారీ బహిరంగ సభకు కూడా అటెండ్ కావాల్సి ఉంది. అయితే మోడీ వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కచ్చితమైన ప్రకటన కోసం అంతా చూస్తున్నారు.
ఉక్కు మీద ప్రధాని ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు భారీ ప్రదర్శనను కూడా నగరంలో నిర్వహించారు. విశాఖ వేదిక మీద నుంచి ప్రైవేటీకరణ ఉండదని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు అయింది.
దానికి కారణం బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం. దీంతో ప్రధాని విశాఖ పర్యటన రద్దు చేస్తున్నట్లుగా పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. దీంతో మళ్ళీ అంతా ఉసూరు మంటున్నారు. ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో విశాఖ వచ్చి రెండేళ్లు దాటింది. 2022 నవంబర్ నెలలోనే ఆయన విశాఖ వచ్చి బహిరంగ సభ నిర్వహించారు. ఆనాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆనాడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ప్రధాని మాట్లాడుతారు అని అంతా అనుకున్నారు కానీ నిరాశే మిగిలింది.
ఇక ఎన్నికల వేళలో ప్రధాని సభ విశాఖలో ఉంటుందని అనుకున్నా అనకాపల్లి లో బీజేపీ పోటీ చేయడంతో ఆ సభతోనే ముగించారు. నాడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతారు అనుకుంటే అపుడూ ఆ విషయం రాలేదు.
ఇపుడు విశాఖ నడిబొడ్డునే ప్రధాని నరేంద్ర మోడీ సభ ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం మీద ఏదో ఒక స్పష్టత వస్తుందని అనుకున్నారు. కానీ ఇది కూడా క్యాన్సిల్ కావడంతో మళ్ళీ మోడీ విశాఖకు ఎపుడు వస్తారు అని ఎదురు చూపులు తప్పడం లేదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విస్పష్టంగా ప్రకటన చేయాలని ఉక్కు కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఢిల్లీ నుంచే వర్చువల్ విధానంలో విశాఖలోని అనేక అభివృద్ధి ప్రాజెక్ట్కులకు ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఆ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కీలక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రధాని విశాఖ గురించి ఏమి చెబుతారో చూడాల్సి ఉంది.