కాంగ్రెస్ కు మోడీ సవాలు మామూలుగా లేదుగా?
ప్రత్యర్థి విషయంలో అస్సలు కనికరం చూపించని మోడీ తాజాగా వక్ఫ్ సవరన బిల్లుపై ఆ పార్టీ వినిపిస్తున్న వాదనకు.. దిమ్మ తిరిగే షాకిచ్చారు.;

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు నాన్ స్టాప్ గా పాలన సాగించి.. ముచ్చటగా మూడోసారి సైతం తనకు తిరుగులేదన్న సత్యాన్ని ప్రపంచానికి చాటారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన రాజకీయాలు ఎంతలా ఉంటాయనటానికి కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఒక నిదర్శనంగా చెప్పాలి. తన ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ లేవకుండా చేసేందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని మోడీ వదులుకోవటం కనిపించదు. అంతేకాదు.. ప్రత్యర్థి విషయంలో అస్సలు కనికరం చూపించని మోడీ తాజాగా వక్ఫ్ సవరన బిల్లుపై ఆ పార్టీ వినిపిస్తున్న వాదనకు.. దిమ్మ తిరిగే షాకిచ్చారు.
వక్ఫ్ చట్టాన్ని సవరించటం వెనుక పేద ముస్లింలకు మేలు చేయటమే అసలు కారణమని ప్రధాని మోడీ వాదిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తుందన్న ఆయన తాజాగా ఒక భారీ సవాలు కాంగ్రెస్ పార్టీకి విసిరారు. ముస్లింల మీద నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉంటే.. ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. అంతేకాదు.. ఎన్నికల్లో ముస్లింలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని కోరారు. ఈ పనులన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? అని సవాలు విసురుతున్నారు.
ఇప్పటికే మైనార్టీ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఆ పార్టీ తీసుకునే చర్యల కారణంగా హిందువులు పెద్ద ఎత్తున నష్టపోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారానికి మరింత ఊతం కలిగేలా ప్రధాని మోడీ సవాలు ఉందని చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ నిబంధలన్ని ఆ పార్టీ స్వార్థ పూరితంగా మార్చేసిందన్నారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అధికారం కోసం ఆయుధంలా వాడుకుంటే.. ఓటుబ్యాంకు వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఉన్న వక్ఫ్ చట్టం కొంతమంది భూ మాఫియా వ్యక్తులకే ఉపయోగపడిందన్న మోడీ.. ఈ చట్టంతో ముస్లింలకు ఒరిగిందేమీ లేదన్నారు. వక్ఫ్ చట్టానికి తాము చేసిన సవరణలతో టూటీకి తెర పడుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీలకు ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందంటూ మండిపడ్డారు. మోడీ తాజా వ్యాఖ్యలకు.. కాంగ్రెస్ ఎలా రియాక్టు అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మోడీ విసిరిన సవాలుకు సానుకూలంగా స్పందిస్తే మాత్రం దేశ రాజకీయ ముఖచిత్రమే మొత్తంగామారిపోతుందని చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.