ఉద్యమాలు తర్వాత చేద్దురు.. తమిళంలో సంతకాలు చేయండి: మోడీ
తమిళనాడు సీఎం స్టాలిన్ సహా.. అధికార పార్టీ డీఎంకే నేతలు కొన్నాళ్లుగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.;

తమిళనాడు సీఎం స్టాలిన్ సహా.. అధికార పార్టీ డీఎంకే నేతలు కొన్నాళ్లుగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇతర దక్షిణాది రాష్ట్రాలను కూడా.. ఏకం చేసి కేంద్రంపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మోడీని కేంద్రంగా చేసుకుని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ.. తమిళనాడులోని అధికార పార్టీ నాయకులకుచురకలు అంటించారు. ``ఉద్యమాలు తర్వాత చేద్దురు.. ముందు తమిళంలో సంతకాలు చేయండి`` అని వ్యాఖ్యానించారు.
భారత దేశంలోనే కీలకమైన పంబన్ బ్రిడ్జిని(రామేశ్వరం-తమిళనాడులోని తాంబరం ప్రాంతాలను కలిపే వంతెన.. ఇది 2.07 కిలో మీటర్లు ఉంటుంది. దీనిని పూర్తిగా కేంద్రమే నిర్మించింది) ప్రారంభించిన అనంతరం మోడీ ఇక్కడ నిర్వహించిన బహిరంగం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎంకే నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. ``హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారు.. వారి సంతకాలను మాత్రం బ్రిటీష్ వారు వదిలి వెళ్లిన భాషలో చేస్తున్నారు.మరి వారికి మాతృభాషపై ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది`` అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తమిళం గొప్పతనాన్ని ప్రధాని ప్రస్తావించారు. తమిళ భాషను విశ్వవిఖ్యాతం చేసేందుకు బీజేపీ నడుం బిగించిం దని చెప్పారు. ఈ క్రమంలోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. తమిళనాడును ప్రాచీన భాషగా గుర్తించి ఏటా నిధులు ఇస్తున్నామని తెలిపారు. తమిళ భాష, సంస్కృతులను ప్రపంచదేశాలకు పరిచయం చేసేందుకు కూడా కేంద్రం అహర్నిశలూ కృషి చేస్తోందన్నారు. అయినా.. ఇక్కడి నాయకులకు(డీఎంకే) సంతృప్తి లేదని ఎద్దేవా చేశారు. ఇక, కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలోనూ.. తమకు అన్యాయం జరుగుతోందని చెప్పిన సీఎం స్టాలిన్ వాదనను కూడా మోడీ తోసిపుచ్చారు.
స్టాలిన్ కోసం కుర్చీ
2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో 900 కోట్ల రూపాయలను మాత్రమే తమిళనాడుకు ఇచ్చిందన్న మోడీ.. తాము ఒకే ఏడాది రూ.600 కోట్లను ఇవ్వడం ద్వారా.. తమిళనాడు అభివృద్దికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ విషయాన్ని కొందరు.. తమ కళ్లజోళ్లు మార్చుకుని పరిశీలిస్తే.. అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే.. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి ముఖ్యమంత్రిహోదాలో స్టాలిన్ హాజరు కావాల్సి ఉంది. ఆయన కోసం సభలో సీటు కూడా వేశారు. కానీ, ఆయన డుమ్మా కొట్టడం గమనార్హం. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. ఇలానే ప్రధానిపై వైరంతో ఆయన పాల్గొన్న కార్యక్రమానికి డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.