మోడీ ఫారిన్ టూర్లు సరే.. మన 'పాస్ పోర్టు' వాల్యూ సంగతి చూడండి!

నరేంద్ర మోడీ చాలా వేగంగా పలు విదేశాలను కవర్ చేయటమే కాదు దౌత్య పరంగా మరింత ముందుకు తీసుకెళ్లారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

Update: 2024-09-08 09:30 GMT

పాతికేళ్ల తర్వాత భారత ప్రధాని మోడీ.. ఆ దేశానికి.. గడిచిన నలభై ఏళ్లలో ఆ దేశానికి వెళ్లని మన ప్రధాని.. ఆ లోటు తీరుస్తున్న మోడీ.. ఇలాంటి వ్యాఖ్యలతో ఉన్న వార్తల్ని మనం చాలానే చదివి ఉంటాం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతల్ని చేపట్టిన మోడీ.. మళ్లీ తన విదేశీ పర్యటనల పరంపరను చేపట్టటం తెలిసిందే.

ఇప్పటివరకు దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారితో పోలిస్తే.. నరేంద్ర మోడీ చాలా వేగంగా పలు విదేశాలను కవర్ చేయటమే కాదు దౌత్య పరంగా మరింత ముందుకు తీసుకెళ్లారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ సెప్టెంబరు (2024)వరకు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ చేసిన విదేశీ పర్యటనల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 79. ఈ మొత్తం విదేశీ పర్యటనల్లో ఆయన 70 దేశాల్ని కవర్ చేశారు.

అత్యధికంగా ఆయన అమెరికాను 8సార్లు సందర్శిస్తే.. ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఏడుసార్లు.. జర్మనీ.. రష్యాలను ఆరుసార్లు.. చైనా, నేపాల్, సింగపూర్ దేశాల్ని ఐదుసార్లు చొప్పున సందర్శించారు. ఈ మధ్యన రష్యాను.. ఆ వెంటనే ఉక్రెయిన్ ను సందర్శించిన మోడీ తీరు ప్రపంచ దేశాల్ని ఆకర్షించింది. ఇలా దేశాలకు దేశాల్ని మోడీ సాబ్ కవర్ చేస్తున్న వైనం చూసినప్పుడు సంతోషం కలుుతుంది. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.

ప్రపంచ దేశాలకు వెళుతున్న మోడీకి ఘన స్వాగతం లభిస్తుండటం తెలిసిందే. కొన్ని దేశాధినేతలు అయితే.. సంప్రదాయానికి భిన్నంగా మరింత చనువుగా.. ఒక ఆప్త మిత్రుడి మాదిరి మోడీని ట్రీట్ చేయటం కనిపిస్తుంది. మరి.. ఇంత ఇమేజ్ ను సొంతం చేసుకున్న మోడీ హయాంలో.. భారత పాస్ పోర్టు విలువ.. దాని ఇమేజ్ ఎందుకంత తక్కువగా ఉంటుంది? అన్నది సమస్య. పలు దేశాలకు వెళ్లాలని భారతీయులు అనుకుంటే.. ముందుగా వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని దేశాల్లో మాత్రమే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. అది కూడా ఆర్థికంగా మనకంటే తక్కువగా ఉన్న దేశాల్లోనే ఉంది.

అంతే తప్పించి బలమైన దేశాలకు.. డెవలప్డ్ దేశాలకు వెళ్లాలంటే భారత పాస్ పోర్టుకు ఉన్న విలువ ఎంతన్నది తెలిసిందే. ఇదంతా చూసినప్పుడు విదేశీ పర్యటనల సందర్భంగా దేశానికి సంబంధించిన అంశాల్ని చూసే మోడీ.. మన పాస్ పోర్టు విలువను మరింత పెంచేలా చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల పాస్‌పోర్ట్‌ల నెలవారీ ర్యాంకింగ్‌ను ప్రచురిస్తుంది. ఇందులో ఏ దేశ పాస్ పోర్టు ఎంత శక్తివంతమైన అంశాన్ని ర్యాంకులతో పాటు.. ఎన్ని దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని పొందుతున్న విషయం అర్థమవుతుంది.

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్‌ దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులుగా చెప్పాలి. ఈ దేశాల పాస్ పోర్టులు ఉన్న వారికి 227 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రయాణం చేసే వీలుంది. అదే సమయంలో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా మరియు స్వీడన్ పాస్‌పోర్ట్‌లు ప్రపంచంలో రెండో శక్తివంతమైన పాస్ పోర్టుగా గుర్తింపు ఉంది. ఈ దేశాల పాస్ పోర్టులు ఉన్న వారు 193 గమ్యస్థానాలకు వీసా లేకుండా వెళ్లి.. అక్కడకు వెళ్లిన తర్వాత వీసా తీసుకునే వీలుంది.

ఇక.. బెల్జియం, డెన్మార్క్ మరియు బ్రిటన్ దేశాల పాస్‌పోర్ట్‌లు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులో 3వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాలపాస్ పోర్టులు ఉన్న వారు 192 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మరి.. మన దేశం విషయానికి వస్తే.. ప్రపంచంలో శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో మన స్థానం 81. భారత పాస్ పోర్టు ఉన్న వారు కేవలం 61 దేశాలకు మాత్రం వీసా లేకుండా.. ఆన్ ఆరైవల్ వీసాను పొందే వీలుంది.

వీసా లేకుండా భారత్ ను అనుమతించే దేశాల్లో చాలావరకు చాలా చిన్న దేశాలు మాత్రమే. ఆర్థికంగా శక్తివంతమైన దేశాలు.. అభివ్రద్ధి చెందిన దేశాలకు భారతీయులు వెళ్లాలంటే ముందుగా వీసా తీసుకున్న తర్వాతే ప్రయాణం పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే పనిగా విదేశీ టూర్లకు వెళ్లే మోడీ మాష్టారు.. భారత పాస్ పోర్టు ను మరింత పవర్ ఫుల్ అయ్యేలా ఎందుకు చేయరు? అన్నది ప్రశ్న. భారతీయుల వల్ల మోడీకి లభించే గౌరవంలో కాస్త అయినా భారతీయులకు తిరిగి పొందేలా మోడీ సాబ్ ప్రయత్నిస్తే బాగుండు.కాదంటారా?

Tags:    

Similar News