మోడీ సర్ ఉదారత.. కూలీలకు 7 రూపాయల వేతనం పెంపు!
తాజాగా మోడీ సర్కారు సంచలన కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి (మంగళవారం) అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసింది.;

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. రోజు వారీ పనులు చేసుకునే ఉపాధి హామీ కూలీలపై కరుణ వర్షం కురిపిం చారు. వారి జీవితాలు బాగుండాలని.. వారి ఆదాయాలు పెరగాలని.. ఆకాశాన్ని తాకుతున్న ధరల నుంచి వారు భారీ ఊరట పొందాలని అభిలషిస్తూ.. రోజు వారీ వేతనాన్ని `భారీ` ఎత్తున పెంచారు. ఈ క్రమంలో రోజు వారీ వేతనంలో అక్షరాలా ఏడు రూపాయలను పెంచుతూ.. తాజాగా మోడీ సర్కారు సంచలన కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి (మంగళవారం) అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనం రూ.307గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 సంవత్సరం కంటే రూ.7 అదనంగా పెంచింది. రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి పెంచిన కొత్త వేతనం అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉపాధి పథకంలో కూలీలకు కేంద్రం ఏటా కనీస వేతనం రాష్ట్రాల వారీగా ప్రకటిస్తుంది. ఈ మొత్తాన్ని చేరుకునే కూలీల సంఖ్య వేళ్లపై లెక్కించే పరిస్థితి. 2024-25లో కనీస వేతనం 300గా ప్రకటించారు. ఇప్పుడు పెరిగిన భారీ వేతనంతో వారు ఇక నుంచి 307 రూపాయలను అందుకుంటా రు.
నోరు కట్టుకున్న విపక్షాలు
రెక్కాడితే కానీ.. డొక్కాడని కూలీలకు కేంద్రం నోట్లో మన్నుకొడుతున్నా.. విపక్షాలు మౌనంగా ఉండిపోయా యన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కప్పు టీ కొనుక్కొని తాగాలంటే రూ.15 రూపాయలు నగరాల్లో రూ.8 గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రోజు వారీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే కూలీలకు రూ.7 పెంచడం ఏంటని అడిగిన ఒక్క పార్టీ కూడా లేకపోవడం.. ఒక్క నేతా నోరు పెగల్చక పోవడం గమనార్హం.
ఎంపీలకు 24 శాతం!
ఇటీవలే ప్రధాని మోడీ.. పార్లమెంటు సభ్యులకు, మాజీ సభ్యులకు కూడా వేతనాలు, పింఛన్లను ఏకంగా 24 శాతం పెంచుకున్నారు. అదికూడా.. గత ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. కానీ, కూలీల విషయానికి వస్తే.. మాత్రం.. 7 రూపాయలు విదిలించి.. చేతులు దులుపుకొని.. పేదల మేలు కోసమే ఈ నిర్నయం తీసుకున్నట్టుగా ప్రకటించడం గమనార్హం. మరి దీనిని ఎలా అర్ధం చేసుకోవాలో బీజేపీ నేతలు చెబితే బెటర్ అంటున్నారు పరిశీలకులు.