మోదీ.. పాడ్ కాస్ట్ లో తొలిసారి.. ‘పొరపాట్లు’ ఒప్పేసుకున్నారు

తాజాగా జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఎప్పుడూ మీడియా ముందు తన మనోగతం విప్పని మోదీ.. ఇందులో తన మనసు విప్పి మాట్లాడారు.

Update: 2025-01-10 07:53 GMT

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ.. ప్రధాని అయిన పదిన్నరేళ్లలో కానీ.. మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని నాయకుడు మోదీ. దీనికి ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా టీవీల్లోకి వచ్చేయడం మోదీ స్టయిల్. గత రెండు విడతల్లో ఇదే జరిగింది. మూడో విడతలో మాత్రం కాస్త మార్పు కనిపిస్తోంది. తాజాగా మోదీ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికిముందు కువైత్ పర్యటనలో అక్కడి అధికారిక మీడియాతో మాట్లాడారు.

సాధారణ మీడియాకు కాదు..

పాడ్ కాస్ట్.. ఇప్పుడో ఇంటర్వ్యూ స్టయిల్. సాధారణ మీడియా ఇంటర్వ్యూ తరహాలో కాకుండా.. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక శ్రవణ రూపంలో ఉన్న బ్లాగ్. తాజాగా జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఎప్పుడూ మీడియా ముందు తన మనోగతం విప్పని మోదీ.. ఇందులో తన మనసు విప్పి మాట్లాడారు. తానేమీ దేవుడిని కాదని.. సాధారణ మనిషినేనని చెప్పుకొచ్చారు. పొరపాట్లు జరుగుతాయని, గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. మోదీ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇదే తొలిసారి. జిరోదా ప్రముఖ వ్యాపారి. ఆయన నిర్వహిస్తున్న పాడ్‌ కాస్ట్‌ లో మోదీ అతిథిగా పాల్గొన్నారు.

దీని ట్రైలర్‌ వీడియోను నిఖిల్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ రీ పోస్ట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను వీరు గుర్తుచేసుకున్నారు. ‘ఈ ఇంటర్వ్యూను మీరంతా ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.

2 నిమిషాలకు పైగా ఉన్న మోదీ-నిఖిల్ పాడ్ కాస్ట్ వీడియో ట్రైలర్ లో రాజకీయాలు, వ్యవస్థాపకత, లీడర్ షిప్ చాలెంజెస్ తదితర అంశాలపై చర్చించారు. మొట్టమొదటే నిఖిల్ కామత్.. ఓ ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తుండడం తనకు ఒకింత భయంగా ఉందంటూ మొదలుపెట్టారు. ‘ఇదే నా తొలి పాడ్‌ కాస్ట్‌. ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు’ అని వాతావరణాన్ని తేలిక చేశారు.

రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచనలు ఏమిటి? అని కామత్ ప్రశ్నించగా.. ‘రాజనీతి’ కలిగినవారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మోదీ జవాబిచ్చారు. సొంత లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు కాకుండా ప్రజా సేవ చేయాలన్న లక్ష్యాన్ని పూనుకోవాలని సూచించారు.

మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాల ప్రస్తావన కూడా ఈ పాడ్ కాస్ట్ లో వచ్చింది. నేను ఏదేదో అని ఉంటాను. పొరపాట్లు ఉండొచ్చు. నేనూ మనిషినే. దేవుడిని కాదుగా’’ అంటూ చెప్పుకొచ్చారు.

గత రెండు పర్యాయాలు ప్రధానిగా తన అనుభవాలను మోదీ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు. పాడ్ కాస్ట్ పూర్తి వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో తేదీ పేర్కొనలేదు.

Tags:    

Similar News