మోడీకి మాత్రమే మర్యాదా? భారతీయులకు ఉండదా?

నిజమే కొందరు భారతీయులు అక్రమ మార్గంలో అగ్రరాజ్యానికి చేరుకోవటం.. తప్పుడు పద్దతుల్లో వెళ్లిన వారిని అధికారులు అదుపులోకి తీసుకోవటాన్ని కాదనలేం.

Update: 2025-02-17 04:54 GMT

కలిసినంతనే పొగడ్తలు.. ఆత్మీయ ఆలింగనాలు.. మిత్రుడిగా గొప్పగొప్ప మాటలు. ఇలాంటివన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసిన ప్రతి సందర్భంలోనూ చూస్తాం. భారతదేశంతో అమెరికాకు ఉన్న అనుబంధం గురించి కానీ.. ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధం గురించి అదే పనిగా మాట్లాడే అమెరికా అధ్యక్షుడు.. చేతల వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం దేనికి నిదర్శనం?

నిజమే కొందరు భారతీయులు అక్రమ మార్గంలో అగ్రరాజ్యానికి చేరుకోవటం.. తప్పుడు పద్దతుల్లో వెళ్లిన వారిని అధికారులు అదుపులోకి తీసుకోవటాన్ని కాదనలేం. దాన్ని సమర్థించుకోవటం కూడా సరి కాదు. కాకుంటే.. అలా తప్పులు చేసే వారిని తిరిగి వారి దేశానికి పంపించే క్రమంలో గౌరవపూర్వకంగా తిరిగి పంపితే పోయేదేముంది? అలా పంపే దేశాల విషయంలో అమెరికా వ్యవహరించే తీరును కొన్ని దేశాలు తప్పు పట్టటమే కాదు.. అమర్యాదగా తమ ప్రజల్ని తిరిగి పంపిన పక్షంలో విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించమంటూ కరాఖండిగా చెప్పేసిన వైనాల్ని చూస్తున్నాం.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లి.. అగ్రరాజ్య అధినేత ట్రంప్ ను కలిసి.. కుశల ప్రశ్నలు వేసి.. ముచ్చట్లు పెట్టుకోవటం.. మోడీ కోసం మంచి విందును ఏర్పాటు చేయటం లాంటివి చాలానే చేశారు. తన కంటే మంచి బేరగాడిగా మోడీకి కితాబు కూడా ఇచ్చారు. ఇన్ని చెప్పిన ట్రంప్ ను .. ఎప్పటిలానే భుజం మీద ఆత్మీయంగా చరిచే మోడీ.. తన వాళ్లను తిరిగి పంపే విషయంలో గౌరవంగా పంపాలన్న మాటను గట్టిగా చెప్పి ఉండొచ్చు కదా? మిత్రుడిగా ఆ మాత్రం చేయలేరా? తాజాగా దేశానికి వచ్చిన రెండు విమానాల్లోని భారతీయుల చేతులకు.. కాళ్లకు బేడీలు వేయటం.. సిక్కుల తలపాగాల్ని అనుమతించకపోవటం లాంటి తీరు చూస్తే.. అగ్రరాజ్య అహంకారం ఇట్టే కనిపిస్తుంది. అదే సమయంలో.. దేశ ప్రధానికి మాత్రమే గౌరవమర్యాదలు దక్కుతాయా? దేశ ప్రజలకు దక్కవా? అన్నది కూడా ప్రశ్నగా అనిపిస్తుంది.

ఇక్కడో ఉదాహరణ చెప్పి.. ఈ విషయాన్ని ముగిస్తాను. మీకు మంచి మిత్రుడు ఉన్నాడని అనుకుందాం. వాడి కొడుకు మీ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడని అనుకుందాం. ఆ విషయం మీకు తెలిసింది. అప్పుడు మీరెలా రియాక్టు అవుతారు? మామూలు దొంగను ఎలా డీల్ చేస్తారో.. అలా చేయరు కదా? ఇదే సూత్రాన్ని అక్రమ వలసదారుల విషయంలో అమెరికా ఎందుకు పాటించదు? అలా పాటించని విషయాన్ని మోడీ సర్కారు ఎందుకు ప్రశ్నించరు?

Tags:    

Similar News