కర్త-కర్మ, కాంగ్రెస్.. క్రియ మోడీ.. విషయం ఇదీ!
కర్త-కర్మ వరకు మాత్రమే ఈ పార్టీ పరిమితం అయింది. క్రియను మాత్రం ప్రధాని నరేంద్రమోడీ నడిపించారని అంటున్నారు జాతీయ రాజకీయ విశ్లేషకులు.
'కర్త.. కర్మ.. క్రియ..' ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆకాంక్షలతో ఏర్పాటు చేసి.. ముందుకు తీసుకువెళ్లాలని భావించిన 'ఇండియా' కూటమి విషయంలో కర్త-కర్మ వరకు మాత్రమే ఈ పార్టీ పరిమితం అయింది. క్రియను మాత్రం ప్రధాని నరేంద్రమోడీ నడిపించారని అంటున్నారు జాతీయ రాజకీయ విశ్లేషకులు. ఇది కొంత వరకు భిన్నంగానే ఉన్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇదేనిజమని చెబుతున్నారు.
కాంగ్రెస్ అసిధారా వ్రతం!
కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలోకి రావాలనేది ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే కొన్నికొన్ని విషయాల్లో తగ్గి.. తన ను తాను తగ్గించుకుని ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టింది. ఈ క్రమంలోనే తమకు బద్ధ విరోధులుగా ఉన్నప్పటికీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సహా.. ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్ వాదీ పార్టీలతోనూ జట్టుకట్టింది. కర్తగా ముందుకు నడిపించింది. కలసి ఉంటే.. కలదు అధికారమని మెప్పించింది.
ఈ క్రమంలోనే నాలుగు దఫాలుగా ఇండియా కూటమి సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక, కీలకమైన బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను కూడా కలుపుకొంది. వాస్తవానికి 'ఇండియా' కూటమి రూపకర్తల్లో నితీష్ ఒకరు. అన్ని పార్టీలూ కలిస్తే.. మోడీని గద్దెదించడం పెద్ద కష్టం కాదన్న ఆయన మాటే తర్వాత కాలంలో కాంగ్రెస్ రూపంలో కర్మగా మారి.. పని దిశగా నడిపించింది. మరో రెండు మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు అనగా.. ఈ ఇండియాకూటమిలో విచ్ఛిన్నం ఏర్పడింది. కాదు కాదు.. పూర్తిగా ఇప్పుడు విడిపోయింది.
అటు మమత.. ఇటు కేజ్రీవాల్.. మరోవైపు నితీష్.. మొత్తంగా ఇండియా కూటమికి గుండు కొట్టేశారు. తమ దారులు తాము వెతుక్కున్నారు. దీనికి కారణం.. మోడీ 'క్రియ'! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ముగ్గురిని బదాబదలు చేయడం ద్వారా.. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడంలో మోడీ క్రియ అద్భుతంగా పనిచేసిందని చెబుతున్నారు.
1) మమత విషయాన్ని తీసుకుంటే.. ఆమె మేనల్లుడు సహా.. పలువురు ఎంపీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఒక మహిళా ఎంపీపై పార్లమెంటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బీజేపీతో కయ్యానికి దిగితే.. మొత్తానికే మోసమని మమత ఇండియా కూటమి నుంచి తప్పేసుకుంది. ఇదీ.. మోడీ క్రియ!
2) కేజ్రీవాల్.. మద్యం కేసులో సమన్లపై సమన్లు వస్తున్నాయి. ఏక్షణమైనా.. ఆయనను అరెస్టు చేయొచ్చ న్న వార్తలు కూడా వచ్చాయి. అంతే.. ఆయన ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకున్నంత పనిచేశా రు. ఈడీ దూకుడు తగ్గింది.. ఇది కూడా మోడీ క్రియే!
3) నితీశ్ కుమార్.. బిహార్ సీఎం పదవి కోసం పెనుగులాటలో ఆయనకు ఆర్జేడీ ప్రధాన శత్రువుగా ఉంటుందని ఊహించి.. అదేసమయంలో బీజేపీ అభయం దక్కడంతో ఆయన ఏకంగా సర్కారునే మార్చేశారు. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పారు. ఇదీ.. మోడీ క్రియే!!