37 మందిపై వేటు వేసిన మోడీ!
మోడీ 2.0లో ఒక వెలుగు వెలిగిన పలువురు నేతలకు సైతం ఈసారి మంత్రివర్గంలో చోటు లభించకపోవటం ఆసక్తికరంగా మారింది
మోడీ 2.0లో కేంద్ర మంత్రులుగా వ్యవహరించిన పలువురికి మోడీ 3.0లో అమాత్య కొలువు దక్కలేదు. మారిన రాజకీయ సమీకరణాలతో పాటు.. పని తీరు బాగోలేని వారి విషయంలో మోడీ కఠినంగా వ్యవహరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రపక్షాలకు పెద్దపీట వేయాల్సి రావటం.. అందరిని కలుపుకు వెళ్లాల్సిన గురుతర బాధ్యత ఆయన మీద ఉండటంతో పలువురు విధేయులకు నో చెప్పేసిన పరిస్థితి.
మోడీ 2.0లో ఒక వెలుగు వెలిగిన పలువురు నేతలకు సైతం ఈసారి మంత్రివర్గంలో చోటు లభించకపోవటం ఆసక్తికరంగా మారింది. మొత్తం 37 మంది కేంద్ర మంత్రులకు తాజా కేబినెట్ లో కొలువు దక్కలేదు. ఈ 37 మందిలో ఏడుగురు కేబినెట్ ర్యాంకు అమాత్యులు కాగా.. మిగిలిన 30 మంది సహాయ మంత్రులు కావటం గమనార్హం. కేబినెట్ మంత్రులుగా వ్యవహరించిన..
స్మ్రతి ఇరానీ
అనురాగ్ ఠాకూర్
నారాయణ్ రాణె
పురుషోత్తం రూపాలా
అర్జున్ ముండా
ఆర్ కే సింగ్
మహేంద్రనాథ్ పాండేలకు తాజా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. మోడీ 2.0లో కేంద్ర మంత్రులుగా వ్యవహరించి.. తాజా కేబినెట్ లో కొలువు దక్కించుకోని 37 మందిలో 18 మంది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన వారే కావటం గమనార్హం. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉండి.. తాజాగాముగిసిన లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కేంద్ర మంత్రిగా కొలువు దక్కించుకున్న ఏకైక నేతగా ఎల్. మురగన్ నిలిచారు. మోడీ2.0లో సహాయ మంత్రులుగా పని చేసి తాజా కేబినెట్ లో చోటు దక్కించుకోని వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు.