ఏపీలో నాలుగింటి మీద కన్ను.. మోడీకి ఈజీ టాస్కేనా ?
రాజంపేట నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఏపీలో బీజేపీ పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లను తీసుకుంది. అలాగే పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఈ ఎంపీ సీట్లలో కనీసంగా నాలుగు గెలిచి తీరాలని బీజేపీ పట్టుదలతో ఉంది అని అంటున్నారు. బీజేపీకి కేటాయించిన ఆరు ఎంపీ సీట్లు తీసుకుంటే అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట ఉన్నాయి. ఇందులో అరకు ఎస్టీ సీటు అయితే తిరుపతి ఎస్సీ రిజర్వుడు సీటు. ఈ ఆరింటిలో బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది రాజంపేట, నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి. ఈ నాలుగింటిలో బిగ్ షాట్స్ నే బీజేపీ బరిలోకి దించింది.
రాజంపేట నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన 2009 తరువాత ఎన్నికల బరిలోకి దిగడం ఇదే ప్రధమం. ఆయన కుటుంబానికి పీలేరులో పట్టుంది. పీలేరు నుంచి ఆయన సోదరుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అంటే రాజంపేట సీటు బీజేపీకి ఎంత ముఖ్యమో అర్ధం అవుతోంది.
ఇక రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆమె తరఫున కూడా ప్రధాని ప్రచారం చేస్తున్నారు. రాజమండ్రి గతంలో బీజేపీ ఖాతాలో పడిన సీటే కావడంతో ఈసారి కూడా గెలుచుకోవాలని బీజేపీ పట్టుదల మీద ఉంది.
అదే విధంగా చూస్తే నర్సాపురం పార్లమెంట్ సీటులో బీజేపీ 2014లో గెలిచింది. ఈసారి కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పాతిక ఏళ్ళుగా బీజేపీలో పనిచేస్తున్న శ్రీనివాస వర్మకు ఎంపీ టికెట్ ని బీజేపీ ఇచ్చింది. క్షత్రియ సామాజిక వర్గం అత్యధికసార్లు గెలిచిన సీటు ఇది. దాంతో ఈ సీటులో సామాజిక సమీకరణలను సరిచూసుకుని మరీ బీజేపీ వర్మను పోటీలో నిలబెట్టింది.
ఉత్తరాంధ్రా జిల్లాలో బీజేపీ రెండు ఎంపీ సీట్లలో పోటీలో ఉంది. అందులో అరకు తో పాటు అనకాపల్లి ఒకటి. ఇక్కడ నుంచి బిగ్ షాట్ సీఎం రమేష్ బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనను గెలిపించడానికి ప్రధాని ఈ నెల 6న ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. ఇలా చూస్తే కనుక ఆరింట నాలుగు ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ భారీ టార్గెట్ నే పెట్టుకుంది.
అయితే బీజేపీకి ఈ సీట్లలో ఉన్న బలమెంతా అంటే గట్టిగా చెప్పాలంటే ఏ ఒక్క పార్లమెంట్ సీటులోనూ బీజేపీకి కనీస మాత్రంగా అయినా బలం లేదు. బీజేపీ అందుకే పొత్తులు పెట్టుకుంది. ఈ సీట్లలో టీడీపీకి జనసేన కి బలం ఉంది. ఆ రెండు పార్టీల మద్దతుతో మోడీ చరిష్మాతో ఈ నాలుగు ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చూస్తోంది.
అయితే ఈ నాలుగు సీట్లలో కూడా బీజేపీ వైసీపీ బలమైన అభ్యర్ధులనే పోటీకి పెట్టింది. అయితే సామాజిక సమీకరణలను చూసుకుని వైసీపీ కొత్త ముఖాలను రాజమండ్రి, నర్సాపురంలలో బరిలోకి దించగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజంపేట లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఇక సీఎం రమేష్ కి పోటీగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి నుంచి రంగంలో ఉన్నారు. సో ఈ సీట్లలో టఫ్ ఫైట్ జరుగుతోంది. అనుకున్నత ఈజీ అయితే కాదు అని అంటున్నారు. కానీ బీజేపీ ఏపీ నుంచి నాలుగు ఎంపీ సీట్లు తీసుకుని వెళ్లాలని మాత్రం పట్టుదలగా ఉంది.