ప్రజాస్వామ్యం అంటే.. ఇదేనా మోడీ సర్.. ప్రజలెన్నుకున్న సర్కారును అచేతనం చేయడమేనా?
కాంగ్రెస్ రాచరిక పాలనలో ప్రజాస్వామ్యం గాంధీల కుటుంబానికే పరిమితమైంది
''కాంగ్రెస్ రాచరిక పాలనలో ప్రజాస్వామ్యం గాంధీల కుటుంబానికే పరిమితమైంది. బుజ్జగింపు రాజకీయాలు.. పట్టుదల రాజకీయాలు ప్రజలను ఈ దేశాన్ని కూడా నాశనం చేశాయి. ఇలాంటివారిని దేశం నుంచి నిష్క్రమించేలా(క్విట్) చేయాలి''.. రెండు రోజుల కిందట ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి వర్చువల్‌గా చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన అమృత వాక్కు లు!! ప్రజాస్వామ్యం గురించి చెప్పిన నీతి సూక్తులు!!
కట్ చేస్తే.. ప్రజల కొరకు-(ఫర్ ది పీపుల్), ప్రజల చేత-(బై ది పీపుల్), ప్రజల కోసం(ఆఫ్ ది పీపుల్) -అని నిర్వచించిన ప్రజాస్వామ్యం.. నేడు.. కేంద్ర పాలకుల పంతాలు, ప్ట్టింపులు, కక్ష పూరిత రాజకీయాల కబంద హస్తాల్లో చిక్కి శల్యం కావడం లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజలచేత ఎన్నుకోబడిన, సుమారు కోటి 50లక్షల మంది ఓటర్లు తమ తీర్పు ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అచేతనం చేయడమే లక్ష్యంగా ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రూపకల్పన చేశారనేది నిష్టుర సత్యం అంటున్నారు పరిశీలకులు.
ఈ బిల్లు ఆమోదం పొందింది. ఫలితంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. నిమిత్త మాత్రం కానుంది. చట్టం చేసినా.. అధికారాలు ఉండవు. ప్రజలకు మేలు చేయాలన్నా.. దిగువ స్థాయి యంత్రాంగాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు కూడా.. చట్టం రూపంలో కేంద్రం లాగేసుకుంది. సో.. మొత్తంగా.. ప్రజాస్వామ్య యుతంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి .. ఎన్నుకున్న ప్రభుత్వం కేవలం మట్టి ముద్దగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే పోలీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవు. కనీసం ఒక కానిస్టేబుల్‌ను ఆదేశించే పరిస్థితి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి లేకుండా పోయింది. ఇక, ఇప్పుడు దిగువస్థాయి అధికారులపైనా ఎలాంటి అధికారం లేకుండా పోతుంది. కనీసం తహశీల్దాన్‌ను ప్రశ్నించే స్థాయి కూడా ముఖ్యమంత్రి కోల్పోవడం ఖాయం. మరి ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఇక, ఒరిగేది ఏమిటి? ప్రజాస్వామ్య పరిరక్షకులుగా.. అందుకోసమే ప్రజల్లోకి వచ్చామని చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం ఇలా చేయొచ్చా? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిమిత్త మాత్రం చేసి.. సర్వాధికారులు గుండుగుత్తగా తన చేతిలో పెట్టుకుంటే.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుందని ఎలా చెబుతారు?
ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి శత్రువుల బారిన పడ్డి నిరాయుధ సైనికుడుగా మిగిలిపోవడం ప్రజాస్వా మ్య భారతికి తలవొంపులు కాదా? అనేది మేధావుల ప్రశ్న. కేంద్ర పాలిత ప్రాంతం కనుక..(నిజానికి సర్వాధికారాలు కేంద్రానికి దఖలు పడాలని.. రాజ్యాంగం ఎక్కడా చెప్పడం లేదు. నాడు అంబేద్కర్ కానీ, నెహ్రూ కానీ.. ఇలా ఆలోచించలేదు కూడా) కొంత వరకు కేంద్రం పెత్తనం చేయొచ్చు. కానీ, ఇక, తమ అధికారం ఢిల్లీ(ప్రభుత్వం)లో సాగదని గుర్తించి.. కేజ్రీవాల్ చేతులు కట్టేందుకు ఎంచుకున్న ఈ పంథా ఏమేరకు ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేస్తుందో ప్రధాన మంత్రికి, ఆయన పరివారానికే ఎరుక!!