ఇదేం మొండితనం మోడీ సాబ్? వివాదాస్పద బిల్లుపై అదే పంతం!
స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఉండేలా కొన్నింటి విషయంలో చేసిన తప్పులకు.. గడిచిన కొద్దికాలంగా ఫలితం అనుభవిస్తున్నారు.
పట్టుదల ఉండాలి. కానీ.. మొండితనం పనికిరాదు. అధికారం శాశ్వితం కాదు. కానీ.. వ్యవస్థల్ని ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వర్తమానాన్ని మాత్రమే కాదు భవిష్యత్తును సైతం పరిగణలోకి తీసుకోవాలి. అందుకు భిన్నంగా చేతిలో అధికారం ఉన్న వేళ.. ఇష్టారాజ్యంగా తీసుకునే నిర్ణయాలు.. తర్వాతి రోజుల్లో వారికే తలనొప్పిగా మారే వీలుంది. స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఉండేలా కొన్నింటి విషయంలో చేసిన తప్పులకు.. గడిచిన కొద్దికాలంగా ఫలితం అనుభవిస్తున్నారు. కాలం అందరికి ఒకేలా అన్ని వేళల్లోనూ ఒకేలా ఉండదు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది.
దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకభూమిక పోషించే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి.. ఆ సంస్థకు పెద్దగా వ్యవహరించే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్.. ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం పక్కన పెట్టి.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించిన వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. తన పంతాన్ని నెగ్గించుకోవటం కోసం మోడీ సర్కారు వ్యవహరించిన తీరును పలువురు తప్పుపడుతున్నారు. ఓవైపు విపక్షాలు.. మరోవైపు మాజీ కమిషనర్లు అభ్యంతరం చెప్పినా కూడా వెనక్కి తగ్గకుండా తాము కోరుకున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక అధికారుల నియామకం ఉండాలన్న బిల్లును రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదించుకున్న వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.
గత ఆగస్టులో తీసుకొచ్చిన ఈ బిల్లులో పలు కీలక సవరణలు చేపట్టి.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ .. ఇతర కమిషనర్ల నియామకం.. సర్వీసు.. విధివిధానాల నిబంధనల బిల్లును కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ల నియామకంపై పార్లమెంటు చట్టం చేసే వరకు ప్రధాని.. లోక్ సభలో ప్రతిపక్ష నేత.. సీజేఐలతో కూడిన సెలెక్టు ప్యానెల్ వారి నియామకాలు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.
అయితే.. ప్రభుత్వం రాజ్యాంగంలోని 324(2) అధికరణ ప్రకారం ఆగస్గు 10న బిల్లు తెచ్చిందని.. సీజేఐ (సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్) స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చినట్లుగా చెప్పారు. తాజా బిల్లులో ఎన్నికల కమిషనర్ల సెర్చ్ కమిటీలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి.. ఇద్దరు సీనియర్ అధికారులు ఉంటారని.. ఎన్నికల కమిషనర్ల ఎంపిక చేసేందుకు ఐదు పేర్లతో జాబితాను తయారు చేసి సెలెక్ట్ ప్యానెల్ కు పంపుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు కేబినెట్ కార్యదర్శి స్థానంలో కేంద్ర న్యాయమంత్రిని చేర్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా సీజేఐకి బదులుగా కేంద్ర మంత్రికి స్థానం కల్పించటంపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ బిల్లు చట్టవిరుద్ధమని.. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని మండిపడుతున్నారు. తమకు అనుకూలమైన వారితో కమిషన్ ను నింపుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏమైనా.. ఇలాంటి తీరు సరికాదన్న వాదన వినిపిస్తోంది.