మోడీ వరుస ఇంటర్వ్యూలు దేనికి నిదర్శనం?

దేశ ప్రధానిగా పదేళ్లు వ్యవహరించిన నరేంద్రమోడీ.. గతంలో ఎప్పుడూ చేయని పనులు.. ఆయన నుంచి ఏ మాత్రం ఆశించని పనులు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2024-05-27 04:09 GMT

దేశ ప్రధానిగా పదేళ్లు వ్యవహరించిన నరేంద్రమోడీ.. గతంలో ఎప్పుడూ చేయని పనులు.. ఆయన నుంచి ఏ మాత్రం ఆశించని పనులు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ప్రధానమంత్రులు ఎవరైనా సరే.. మీడియాతోనూ.. మీడియాకు సంబంధించిన కొందరితోనూ టచ్ లో ఉంటారు. కనీసం ఏడాదిలో ఒకసారైనా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుంటారు. కానీ.. మోడీ అందుకు భిన్నం. ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక విలేకరుల సమావేశాన్ని నిర్వహించటం కనిపించదు. అంతేకాదు.. తన విదేశీ పర్యటనల సందర్భంగా మీడియా ప్రతినిధులను తనతో తీసుకెళ్లే సంప్రదాయానికి ఆయన ఎప్పుడో మంగళం పాడేశారు.

ప్రధానమంత్రి విదేశీ పర్యటనల సందర్భంగా ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని సీనియర్ జర్నలిస్టులకు ఇవ్వటం నరేంద్ర మోడీకి ఇష్టం లేకపోవచ్చు. లేదంటే.. అనవసరమైన ఖర్చుగా ఆయన భావిస్తూ ఉండొచ్చు. మొత్తంగా మీడియాకు తనకు మధ్య దూరం ఉండాలని నరేంద్ర మోడీ ఆశించొచ్చు. కారణం ఏదైనా కానీ.. మీడియాను తనకు దగ్గరగా రాకుండా ఉండేలా చేయటం మాత్రం కామన్ గా చెప్పాలి.

అలాంటి మోడీ.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సాధారణంగా ఆయన విదేశీ మీడియా సంస్థలకు చెందిన కొందరితోనూ.. స్వదేశంలోనూ ఎంపిక చేసుకున్న ఇద్దరు ముగ్గురితో మినహా మాట్లాడటానికి మక్కువ చూపటం కనిపించదు.

అందుకు భిన్నంగా తన వాణిని.. వాదనను దేశ ప్రజలందరికి తెలిసేలా చేయటం కోసం ఆయన తెగ ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయి మీడియా సంస్థలు మాత్రమే కాదు.. ప్రాంతీయంగా కూడా పేరున్న సంస్థలు కొన్నింటిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వటం చూస్తున్నాం. చూస్తుండగానే.. అదో పరంపరగా మారింది. లెక్కకు మిక్కిలి అన్న చందంగా ఆయన ఇంటర్వ్యూల ప్రవాహం సాగుతోంది. అన్నింటిలోనూ ఒకటే లెక్క. ఆయన చెబుతుంటారు. ఆయన్ను ప్రశ్నలు అడగాల్సిన వారు అడగకుండా ఆయన చెప్పింది రాసుకుంటూనో.. రికార్డు చేసుకుంటూనో ఉండివాల్సింది.

సూటిగా ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వని మోడీ.. ఒకవేళ అలాంటి పరిస్థితి అనుకోకుండా ఏర్పడితే.. ఆ వెంటనే సంబంధం లేని రీతిలో సమాధానాలు చెప్పినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. దేశంలో సూటిగా.. ముఖం పగిలేలా ప్రశ్నలు అడుగుతారన్న పేరున్న జర్నలిస్టులను తనకు దగ్గరగా రానివ్వని మోడీ.. ఎంపిక చేసిన వారికి.. ఎంపిక చేసిన ప్రశ్నల్ని మాత్రమే ప్రశ్నించే వైనం ఇప్పుడో బోరింగ్ గా తయారైందన్న మాట వినిపిస్తోంది.

అంతేకాదు.. ప్రధానమంత్రిని ఎలాంటి ప్రశ్నలు వేయాలి? ఇంటర్వ్యూ సందర్భంగా రిపోర్టర్ ఎలా వ్యవహరించాలి? ఎలాంటి తీరును ప్రదర్శించాలన్న విషయాన్ని వ్యాసాల రూపంలో పబ్లిష్ అవుతున్న తీరు చూస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ అంటే.. అదో ఫార్సులా తయారైందన్న విమర్శ వినిపిస్తోంది. ఇంతకూ ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇవ్వని మోడీ.. ఈసారి అందుకు భిన్నంగా రియాక్టు అవుతూ.. ఇంటర్వ్యూలు ఎందుకిస్తున్నారన్న ప్రశ్నకు లభించే సమాధానం ఒక్కటే. తన వాణిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న తపన. తన పట్ల ప్రజలు పాజిటివ్ గా రియాక్టు కావాలన్న ధోరణి మోడీలో అంతకంతకూ ఎక్కువ అవుతున్న వైనం ఆసక్తికరంగా మారిందన్న మాట చెప్పక తప్పదు.

Tags:    

Similar News