తిరుమలలో మోదీ... దేశం కోసం ప్రార్థన
140 కోట్ల భారతీయులు బాగుండాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుపతికి విచ్చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఆయన గుడికి చేరుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని ప్రధాని దర్శించుకున్నారు.
దర్మనం అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధానికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ప్రధానికి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీడీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అందజేశారు. 140 కోట్ల భారతీయులు బాగుండాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.
మోదీ ప్రధాని హోదాలో తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధాని తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిపోయారు. మహబూబాబాద్ లో ప్రచార సభలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో సాయంత్రం రోడ్ షా నిర్వహిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.