ఏమిటీ మోదీ.. అభి'మతం'? పదేపదే వ్యాఖ్యలు ఓటమి సంకేతం?
పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఇలా మతం ప్రధానంగా ప్రచారం చేయడం మోదీలో ఓటమి భయాన్ని చెబుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి.
పదేళ్లు ఏకధాటిగా అధికారం.. తన మాటకు ఎదురులేదన్నట్లుగా పరిపాలన.. ప్రపంచ స్థాయి నాయకుడిగా గొప్పలు.. వచ్చే సారీ తమదే గెలుపు అనే ప్రకటనలు.. ప్రజలకు అద్భుతంగా సేవ చేశామంటూ డబ్బాలు.. కానీ, ప్రచారం చూస్తే మాత్రం అంతా ‘మతం’చుట్టూనే. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ తీరు.
మళ్లీ హిందూత్వ కార్డుతో..
పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఇలా మతం ప్రధానంగా ప్రచారం చేయడం మోదీలో ఓటమి భయాన్ని చెబుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి. మళ్లీ హిందూత్వ కార్డుతో ఎన్నికలకు వెళ్తోందని తెలుస్తోంది. ప్రజల భావోద్వేగాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆదివారం రాజస్థాన్ లో ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ఆరోపించారు. మంగళసూత్రం విలువ బంగారంలోనో, ధరలోనో లేదని మహిళ కలలకు ప్రతిరూపమైన దాన్ని లాక్కోవడం గురించి మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట ఓట్లు అడగలేక హిందూత్వ కార్డును బయటకు తీస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశం వెలిగిపోతుందని బీజేపీ నేతలు గొప్పలు పోతూ.. హిందూ- ముస్లిం ఎజెండాను బయటకు తేవడంపై రాజకీయ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోనూ అదే మాట..
రాజస్థాన్ లో గత ఆదివారం చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే.. మధ్యప్రదేశ్ లో నాలుగు రోజుల కిందట మోదీ మరోసారి దుమారం రేపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను తగ్గించి.. మతం ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీకి ‘వారసత్వ పన్ను’ అమలు చేయాలనే రహస్య ఎజెండా కూడా ఉంది. ఆ పార్టీ మీ ఆస్తిని లాక్కోవాలని అనుకుంటోంది’ అని పేర్కొన్నారు. అంతటితో ఆగక ‘‘2004లో ఆంధ్రప్రదేశ్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిన కాంగ్రెస్.. 2009, 2014 ఎన్నికల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘శ్రీరాముడు కల్పిత పాత్ర అని కాంగ్రెస్ పార్టీ వాదించింది.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించింది’’ అని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో నవాబుల ప్రస్తావన
నిన్నటి ఆదివారం కర్ణాటకలో ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఈసారి నవాబుల ప్రస్తావన తెచ్చారు. రాజుల (హిందూ) ఆస్తులను లాక్కున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు.. నవాబుల జోలికి వెళ్లలేదని విమర్శించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ టార్గెట్ గా.. ‘‘కాంగ్రెస్ యువరాజుకు మన రాజులు, చక్రవర్తుల కృషి గుర్తుండదు. నవాబులు, సుల్తానులపై ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం లేదు. వందలాది దేవాలయాలను కూల్చివేసి అపవిత్రం చేసిన ఔరంగజేబు దురాగతాలు కాంగ్రెస్‌కు గుర్తుండవు’’ అని వ్యాఖ్యానించారు.
ఏ రాష్ట్రంలో అయినా..
మొత్తమ్మీద వారం రోజులకు పైగా మోదీ ఎన్నికల ప్రచారం ఏ రాష్ట్రంలో జరిగినా మతం చుట్టూనే తిరుగుతోంది. మంగళవారం మోదీ తెలంగాణకు రానున్నారు. మరి ఇక్కడ ఏం మాట్లాడతారో?