మోడీ జంత‌ర్‌మంత్‌... పూర్వోద‌య‌లోకి ఏపీ.. ఏం లాభం?

ఇదీ.. మోడీ మాయ అంటే! ఇది భౌగోళికంగా చూసినా.. లేక ప్రాంతీయ త‌త్వం ఆధారంగా చూసినా.. ఎటూ స‌రితూగ‌దు. అయినా.. కూడా ఏపీని పూర్వోద‌య‌లో క‌లిపేశారు.

Update: 2024-07-27 07:30 GMT

తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్లో కీల‌క‌మైన ప‌దం.. `పూర్వోద‌య‌`. కేంద్ర బడ్జెట్‌ 2024-25లో 'పూర్వోదయ' స్కీమ్‌లోకి కొన్ని రాష్ట్రాలను తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ తెలిపారు. ఆయా రాష్ట్రాల‌ను కూడా ప్ర‌క‌టించారు. అవి.. బిహార్, జార్ఖండ్‌, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రాల‌లో సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్టు చెప్పారు. 'పూర్వోదయ' స్కీమ్ ఆయా రాష్ట్రాల్లో ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుందని గొప్ప‌గా చెప్పారు.

అస‌లు పూర్వోద‌య అంటే ఏంటి?

పూర్వోద‌య- అంటే తూర్పు రాష్ట్రాలు. ఈస్ట్ర‌న్ స్టేట్స్‌. మ‌న దేశంలో ఈశాన్య‌, తూర్పు, ద‌క్షిణాది, ప‌శ్చిమ‌, ఉత్త‌ర భార‌త రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో తూర్పు రాష్ట్రాలు అంటే.. వెస్ట్ బెంగాల్‌, బీహార్‌, ఒడిశా, జార్ఖండ్ మాత్ర‌మే. ఏపీ ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఉంది. అయితే.. దీనిని ఇప్పుడు తూర్పులో ముడి పెట్టారు. ఇదీ.. మోడీ మాయ అంటే! ఇది భౌగోళికంగా చూసినా.. లేక ప్రాంతీయ త‌త్వం ఆధారంగా చూసినా.. ఎటూ స‌రితూగ‌దు. అయినా.. కూడా ఏపీని పూర్వోద‌య‌లో క‌లిపేశారు.

ఇక‌, ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏంటి?

విక‌సిత‌ భారత్ - అనే ప్రభుత్వ లక్ష్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ రాష్ట్రాల‌ను ఆర్థిక కేంద్రాలుగా మార్చేందుకు కేంద్రం దృష్టి సారిస్తుందని నిర్మ‌ల‌మ్మ చెప్పుకొచ్చారు. దేశంలోని తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాలు ధాన్యంతో సమృద్ధిగా ఉన్నాయని, బలమైన సాంస్కృతిక సంప్రదాయాలను కలిగి ఉన్నాయని కూడా చెప్పారు. కానీ.. వాస్త‌వం ఏంటంటే.. 'పూర్వోదయ' కాన్సెప్ట్‌ను 2015లో ఒడిశాలోని పారాదీప్‌లో జరిగిన సమావేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చమురు శుద్ధి కర్మాగారాన్ని అంకితం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

అదనంగా, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, దేశంలోని తూర్పు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాటిలో ఏపీ లేదు. కానీ, ఇప్పుడు కొత్త‌గా చేర్చారు. పోనీ.. నిధులు కేటాయిస్తారా? అంటే.. ఈ విష‌యంపైనే ఒడిశా మాజీ సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ నిప్పులు చెరిగారు. పూర్వోద‌య‌లో ఏపీని ఎలా చేరుస్తార‌ని.. మోడీ స‌ర్కారు.. భౌగొళిక స‌రిహ‌ద్దులు చెరిపేస్తోందా? ఏపీకి రూపాయి ఇచ్చినా ఒప్పుకొనేది లేద‌న్నారు.

మ‌రోవైపు.. పూర్వోద‌య రాష్ట్రాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పిన నిర్మ‌లా సీతారామ‌న్ ఇక్క‌డ కూడా.. బీహార్‌కు నిధుల వ‌ర‌ద కురిపించారు. ఆ రాష్ట్రంలో వివిధ రహదారి ప్రాజెక్టులకు రూ.26,000 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే.. ఏపీకి పూర్వోద‌య అనేది లేనే లేనందున‌.. కేవ‌లం ఇది కంటితుడుపు.. ముక్కు చీద‌డం.. అనే యాంగిల్ అన్న మాట‌. ఇదీ.. మోడీ మాయ అంటే!!

Tags:    

Similar News