జగన్ కు మోడీ ఇచ్చిన బిగ్ ఆఫర్ బయట పెట్టిన సాయిరెడ్డి..!

అవును... బీజేపీ - టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే

Update: 2024-04-12 05:31 GMT

ఎన్నికల సీజన్ లో ఏపీ రాజకీయాలు రోహిణీ కార్తి ఎండలను మరిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో జగన్ ను ఎట్టాగైనా గద్దె దింపాలని భావిస్తున్న చంద్రబాబు... తనకు తోడుగా జనసేన, బీజేపీలను కలుపుకుని వెళ్తున్నారు. ఇదే సమయంలో జగన్ మాత్రం ఒంటరిగానే కదులుతున్నారు. ఈ సమయంలో... టీడీపీతో పొత్తు ఖరారు వేళ హస్తిన కేంద్రంగా ఏపీ రాజకీయాలపై చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు.

అవును... బీజేపీ - టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కూటమిలో బీజేపీ చేరడం వెనుక కృషి అంతా తనదే అని పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్న పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే... పొత్తు చర్చల సమయంలో... చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమయంలో పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగిందనే లీకులు తెరపైకి వచ్చాయి.

అయితే.. ఆ మరుసటి రోజు చంద్రబాబు అక్కడ ఉండగానే జగన్ హస్తినకు వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ లో ప్రధాని మోడీతో జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇలా... ఒకవైపు చంద్రబాబుతో చర్చలు చేస్తూ.. మరోవైపు జగన్ తో సుదీర్ఘబేటీపై రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగింది. సరిగ్గా ఆ సమయంలో టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై కాస్త సందిగ్ధత నెలకొందనే కామెంట్లూ వినిపించాయి.

ఆ సమయంలో వైఎస్ జగన్ కు పీఎం నరేంద్ర మోడీ ఒక ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిరెడ్డి... ఎన్డీఏలో చేరాలని తొలుత తమ పార్టీకి ఆఫర్ వచ్చిందని తెలిపారు. అయితే.. తమ పార్టీ విధి విధానాల కారణంగా బీజేపీతో పొత్తు సాధ్యం కాదని ఆ పార్టీ పెద్దలకు జగన్ స్పష్టం చేసినట్లు తెలిపారు సాయిరెడ్డి. దీంతో... జగన్ రిజక్ట్ చేస్తే... టీడీపీ - బీజేపీ లు కలిశాయా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇక నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న అంశంపైనా సాయిరెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... తాను విశాఖ నుంచి పోటీ చేయాలని భావించానని తెలిపారు. కొన్ని అనువరిక కారణాలవల్ల నెల్లూరులో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ఈ సందర్భంగా సాయిరెడ్డి ధీమాగా చెప్పారు.

ఇదే సమయంలో... తనకు గవర్నర్ కావాలనేది కోరిక అని చెప్పిన సాయిరెడ్డి.. ఇదే విషయాన్ని జగన్ కు చెప్పినట్లు తెలిపారు. ఇదే క్రమంలో... జగన్ ఏం ఆదేశిస్తే తాను అదే పాటిస్తానని విజయ సాయిరెడ్డి తేల్చి చెప్పారు!

Tags:    

Similar News