రీల్ కాదు రియల్: ఏమిటీ సందేశ్ ఖాలీ? ఎవరీ షాజహాన్ షేక్

వెండితెర మీద చూసే విలన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటారన్న పేరుంది షాజ్ హాన్ షేక్ కు

Update: 2024-03-27 06:13 GMT

వెండితెర మీద చూసే విలన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటారన్న పేరుంది షాజ్ హాన్ షేక్ కు. చిన్నకూలీగా మొదలైన అతడి ప్రస్థానం చూస్తుండగానే అంతకంతకూ ఎదిగిపోవటమే కాదు.. తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకునే వరకు వెళ్లిపోయాడు. అంతేనా.. అతడి కంట పడిన భూమి.. అతడి కన్ను పడిన ఆడది తప్పించుకోవటం సాధ్యం కాదన్న అరాచకం అతడి సొంతంగా చెబుతారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతగా చెలరేగిపోయిన అతడి గురించి.. అతడి అక్రత్యాల గురించి జాతీయ మీడియాలో భారీ ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ తెలుగు మీడియాలో అతడి గురించి పెద్దగా వార్తలు వచ్చింది లేదు. ఇంతకూ ఈ షాజహాన్ షేక్ ఎవరు? ఎక్కడివాడు? అతడి పేరుతో ముడిపడిన సందేశ్ ఖాలీ సంగతేంటి? అక్కడి అక్రత్యాలేంటి? చివరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం సందేశ్ ఖాలీ మీద ఫోకస్ పెట్టారెందుకు? లాంటి అంశాల్లోకి వెళితే..

ఏపీలో ఎలా అయితే కోస్తా.. రాయలసీమ.. ఉత్తరాంధ్ర అంటూ ప్రాంతాల వారీగా పిలుస్తారో.. పశ్చిమబెంగాల్ లో ఉత్తర 24 పరగణాల జిల్లాల్ని అలానే పిలుస్తారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉంది సుందర్బన్ అడవులు. అందులోని ప్రాంతమే సందేశ్ ఖాలీ. మొన్నటివరకు ఈ ప్రాంతం గురించి.. ఇక్కడి ప్రజల గురించి దేశానికి తెలిసింది లేదు. అయితే.. షాజహాన్ షేక్ అరాచకాల పుణ్యమా అని ఈ ప్రాంతం పేరు కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది.

ఈ ప్రాంతంలో తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించే అధికార టీఎంసీ నేత షాజహాన్ షేక్. అతడి అరాచకాల్ని తట్టుకోలేని మహిళలు రోడ్డెక్కటంతో పాటు.. నిరసనలతో బెంగాల్ రాష్ట్ర హైకోర్టుతో పాటు గవర్నర్ చూపు తమ మీద పడేలా చేశారు. ఆ ప్రాంత టీఎంసీ నాయకుడిగా పేరున్న షాజహాన్ షేక్ రేంజ్ ఎంతంటే.. అతగాడుస్థానిక ఎమ్మెల్యే.. ఎంపీ కంటే బలవంతుడు. శక్తివంతుడు. అతడ్ని ఎదిరించి బతికి బట్ట కట్టటం అంత తేలికైన విషయం కాదు.

అంతలా పాపులర్ అయిన అతను 1999 ముందు వరకు కేరాఫ్ అడ్రస్ పెద్దగా లేనోడు. కూలీగా.. కూరగాయల అమ్మకం దారుగా చిన్న పనులు చేసుకుంటూ బతికే అతనికో మామ ఉన్నాడు. అతడి పేరు మొస్లేమ్ షేక్. సీపీఎం తరఫున పని చేసే అతని అండతో 2003లోరాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు షాజహాన్ షేక్. 45 ఏళ్ల ఇతగాడు అతి తక్కువ వ్యవధిలోనే ఉత్తర 24 పరగణాల జిల్లాలో కీలక నేతగా మారారు. ఇతగాడి శక్తి గురించి తెలియాలంటే చిన్న ఉదాహరణ చెబితే అర్థమవుతుంది.

2009 తర్వాత పశ్చిమబెంగాల్ లో సీపీఎం వరుస ఓటమిపాలు అవుతున్నా.. షాజ్ హాన్ షేక్.. ఆయన మామ అధికారం మాత్రం చెలామణీ అవుతూనే ఉండేది. వారికున్న పలుకుబడితో అనేక దందాలు చేసేవారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని గుప్పిట్లో పెట్టుకోవటమే కాదు.. పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలు ఏవైనా జరిగితే స్థానికులకు ఆర్థికంగా సాయం చేసి పాపులార్టీని దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే 2013లో టీఎంసీలో చేరిన షాజహాన్ మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్ కు దగ్గరగా ఉండేవాడు.

టీఎంసీ స్థానిక ఎమ్మెల్యే.. ఎంపీ కంటే కూడా షాజహాన్ షేక్ బలమైన నేతగా అభివర్ణస్తారు. రేషన్ స్కాంలో టీఎంపీ మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్ అరెస్టు అయ్యాక.. ఇదే కేసులో ఈడీ అధికారులు షాజహాన్ షేక్ ఇంటిని తనిఖీలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తన అనుచరులతో దాడి చేయించి.. తర్వాత కనిపించకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. దీంతో.. కేంద్రం కన్ను షాజహాన్ మీద పడింది. సందేశ్ ఖాలీ మీద ఫోకస్ చేసిన కేంద్రానికి అక్కడి గురించి.. అక్కడి నేత షాజ్ హాన్ షేక్ గురించిన వివరాలు తిని అవాక్కైన పరిస్థితి.

స్థానికుల భూముల్ని సొంతం చేసుకోవటం.. అందుకు నో చెప్పిన మహిళలపై లైంగిక దాడులు చేయటంలాంటివి షాజహాన్ షేక్ మీద ఆరోపణలు ఉన్నాయి. అతడి మీద కంప్లైంట్ ఇచ్చేందుకు సైతం ధైర్యం చేయలేని వేళ.. ఈడీ దాడుల తర్వాత కొంతమంది మహిళలు అతడికి వ్యతిరేకంగా గళం విప్పారు. అతడ్ని అరెస్టు చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో అతడి దారుణాలు వెలుగు చూశాయి. మీడియాలోనూ హైలెట్ కావటం.. సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ మీడియా సందేశ్ వాలీకి అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో షాజహాన్ షేక్ పాపం పండింది.

ఇతడి చర్యల గురించి కథలు కథలుగా మీడియాలోకి రావటంతో సోషల్ మీడియాలోనూ సందేశ్ వాలీ దుమారం మరింత ఎక్కువైంది. బెంగాల్ హైకోర్టు సైతం ఇతడి దారుణాలపై సీరియస్ అయ్యింది. గవర్నర్ కూడా స్పందించటంతో అతడి అరెస్టు ఖాయమైంది. దీంతో.. సందేశ్ ఖాలీ దేశ రాజకీయాల్లో ఒకచర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో షాజహాన్ షేక్ కు వ్యతిరేకంగాగళం విప్పిన సాదాసీదా మహిళకు తాజాగా సందేశ్ ఖాలీ పరిధిలోకి వచ్చే బసిర్ హట్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ఒక బాధిత మహిళను ఎంపిక చేస్తూ కమలనాథులు తీసుకున్న నిర్ణయం మరింత సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న కొన్ని ఎంపీ స్థానాల్లో సందేశ్ ఖాలీ ఒకటిగా నిలిచింది.

Tags:    

Similar News