మోడీ నోట షాకింగ్ మాట.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సొమ్ము ముస్లింలకే!

దేశ సంపద మొత్తం చొరబాటుదారులకు.. ఎక్కువమంది పిల్లలు ఉన్న వారికి పంచే అధికారం ప్రభుత్వాలకు ఉందా?’’ అంటూ వ్యాఖ్యానించారు.

Update: 2024-04-22 05:46 GMT

సంచలన వ్యాఖ్యలు చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కీలకమైన ఎన్నికల వేళ ఆయన నేరుగా మైనార్టీ ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ దన్నుగా నిలుస్తుందన్న విషయాన్ని ప్రస్తావించటమే కాదు.. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు పెను దుమారాన్ని రేపేలా మారాయి. ఆయనేమన్నారంటే.. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తం మైనార్టీలైన ముస్లింలకు పంచుతుంది. దేశంలోని వనరులపై మైనార్టీలదే తొలి హక్కు అని యూపీఏ హయాంలో పేర్కొన్నారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పున:పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. దేశ సంపద మొత్తం చొరబాటుదారులకు.. ఎక్కువమంది పిల్లలు ఉన్న వారికి పంచే అధికారం ప్రభుత్వాలకు ఉందా?’’ అంటూ వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ లోని జాలౌర్.. భీన్ మాల్ తో పాటు బాంస్ వాడా ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేవారు. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళల మంగళసూత్రాలను కూడా చొరబాటుదారుల పాలు కావటం మీకు సమ్మతమేనా? అంటూ ప్రశ్నించిన వైనం సంచలనంగా మారింది. ఒకప్పుడు 400లకు పైగా స్థానాల్ని గెలుచుకున్న కాంగ్రెస్ నేడు 300స్థానాల్లో సొంతంగా పోటీ చేయటం కూడా కష్టంగా మారిందన్న మోడీ.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు.

ఇండియా పేరుతో విపక్షాలు ఏర్పాటు చేసింది అవకాశవాద కూటమి అని.. అది ఆకాశంలోకి ఎగరకముందే దారం తెగిన గాలిపటం లాంటిదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకాడుతున్న వారు ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చారంటూ పరోక్షంగా సోనియాను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మొదటి దశ ఎన్నికల పోలింగ్ సరళిపై అసంత్రప్తిని ఉన్న మోడీ.. విద్వేషాన్ని రగిలించేలా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News