టార్గెట్ సౌత్ లో.. మోడీషాల ఆటలో బాబు కూరలో కరివేపాకు!
ఏపీలో చంద్రబాబు రూపంలో వారికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తమ రాజకీయ ప్రయోజనాలు మినహా మరేమీ ముఖ్యం కాదనుకునే విషయంలో భారతీయ జనతాపార్టీ ఎంత కచ్ఛితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోరి వస్తున్న అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా వారి తీరు ఉంటుంది. తమకు నచ్చని విషయాల్ని సైతం.. తమకు జరిగే రాజకీయ ప్రయోజనాల ముందు తూకం వేసి.. తమకు మేలు జరుగుతుందన్నంతనే ఎంత కాదనుకున్నా.. వారితో కలిసిమెలిసి ఉండేలా మోడీషాలు వ్యవహరిస్తారని చెబుతారు. నీతులు.. నియమాల్ని పెద్దగా పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా తమ పార్టీ వికాసమే లక్ష్యంగా పని చేయటం కనిపిస్తుంటుంది.
ఎంతకూ అర్థం కాని దక్షిణాదిని ఈసారి జరిగే ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించటమే కాదు..రాబోయే కాలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో నాలుగైదు ఎంపీ స్థానాల్లో విజయం సాధించటం ఖాయమని.. ఏపీలో ఈసారి బోణీ మాత్రమే కాదు.. పొత్తుల్లో భాగంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది మోడీషాల ఆలోచనగా చెబుతున్నారు. దక్షిణాదిన కమల వికాసం కోసం వారి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం తెలిసిందే. ఏపీలో చంద్రబాబు రూపంలో వారికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారని.. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగామార్చుకోవాలన్నది మోడీషాల ఆలోచనగా చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన.. సిద్దరామయ్య సర్కారు చేస్తున్న తప్పులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయటం ఖాయమంటున్నారు.
తమిళనాడులో వారి ప్రణాళికలు వర్కువుట్ కావటం లేదు. ఏపీ.. తెలంగాణలో పరిస్థితి తమకు సానుకూలంగా మారుతున్న వేళలో.. మరింత పట్టు బిగించేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబును కూరలో కరివేపాకులా.. పులుసులో ములక్కాయ మాదిరి వాడుకోవాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. చంద్రబాబుతో మిత్రత్వం కోసం బీజేపీ సానుకూలంగా ఉండటానికి మరో కీలక కారణం.. చంద్రబాబు వయసుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు కేంద్రం అండ చాలా అవసరం. అదే సమయంలో ఏపీలో బీజేపీకి ఉనికి చాటటం అవసరం. ఇలా ఇరు వర్గాలు తమ అవసరాలకు తగ్గట్లు ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకునే ధోరణే మిత్రత్వం దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పక తప్పదు.