కోట్లు పంచుతూ ఓట్లు అడుగుతున్న కేసీఆర్.. రూల్స్ షాకిస్తున్న మోడీ
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని బీజేపీ వదులుకునేలా కనిపించడం లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని బీజేపీ వదులుకునేలా కనిపించడం లేదు. తాజాగా ఓ బలమైన వర్గం ఓట్ల వేటలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయలు అధికారికంగా పంచుతూ ఓట్లు అడుగుతుంటే... అదే అధికారిక ఆదేశాల రూపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఇదంతా... తెలంగాణలోని కీలకమైన ప్రభుత్వ సంస్థ సింగరేణి గురించి, అందులో జరగాల్సిన ఎన్నికల గురించి.
తెలంగాణలో కీలకమైన ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారాయి. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ చేపట్టవలసి ఉంది. కమ్యూనిస్టులు మొదలుకొని రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ పార్టీ వరకూ... సింగరేణిలోని ప్రతి కార్మిక సంఘం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నాయి. ఈ మేరకు ఎన్నికలకు సన్నద్ధం అవుతుండగానే...అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ప్రకటించింది. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.
సింగరేణి పరిధిలో 15 కార్మిక సంఘాలుండగా... ఎన్నికలు నిర్వహించడంపై సాగుతున్న వివాదం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. 13 యూనియన్లు ఇప్పటికిప్పుడు గుర్తింపు ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతున్నాయి. సింగరేణిలో అనేక అంశాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉందని, అవన్నీ సరిచేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని ఆ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్‌కు నేరుగా ఈ మెయిల్స్ కూడా పంపాయి. మెజార్టీ కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో సింగరేణి యాజమాన్యం కూడా అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాలని లేబర్ కమిషనర్‌కు తెలిపింది. అయితే, ఇవన్నీ లైట్ తీసుకుంటూ కేంద్ర కార్మిక శాఖ వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది.
ఇటీవలే దాదాపు రూ.1700 కోట్లు వేజ్ బోర్డు అలవెన్స్, సింగరేణికి చెందిన ఇతరత్రా లాభాలను కార్మికుల ఖాతాలో పడేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా కార్మికులను ఖుష్ చేసి... త్వరలో ఎన్నికలకు వెళ్లాలని డిసైడయ్యారు. అయితే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యూహానికి చెక్ పెడుతూ కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ విడుదల చేసింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో, రూల్స్ పేరుతో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తాము నలిగిపోతున్నామని కార్మికులు వాపోతున్నారు.