వారి చుట్టూ తిరుగుతున్న మోడీ ప్రసంగాలు !

నిజానికి ఆనాడు ఆయన తనపై చేసిన ఆ తరహా ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు మోడీ.

Update: 2024-05-21 03:00 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల సభలలో స్వరం మారుతోంది. తీరు మారుతోంది. దూకుడు ప్లేస్ లో జనాలకు మరింతగా కనెక్ట్ అయ్యేందుకు చేసే ప్రయత్నం కనిపిస్తోంది. తన జీవితాన్ని ఈసారి జనం ముందు పెట్టడానికి మోడీ ప్రయత్నం చేశారు. తాను గుజరాత్ సీఎం గా ఉన్నపుడు అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఆయన ఒడిషా ఎన్నికల ప్రచారంలో భాగంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు.

తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే తనకు 250కి పైగా దుస్తులు ఉన్నాయని మాజీ సీఎం అమర్ సింహ చౌదరి ఆరోపించారని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఆనాడు ఆయన తనపై చేసిన ఆ తరహా ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు మోడీ. అయితే తాను అవే ఆరోపణలను జనం ముందు పెట్టానని చెప్పారు.

ప్రజల ముందే ఆ విషయం తేల్చానని అన్నారు. రూ.250 కోట్లు దోచుకునే సీఎం కావాలా లేక 250 జతల దుస్తులు ఉన్న ముఖ్యమంత్రి కావాలా అంటూ ఆనాడు తాను ప్రజల ముందుకు వెళ్లానని తెలిపారు. అలాంటి సమయంలో ప్రజలు తనకే ఓటు వేశారన్నారు.

అలాగే మరో విషయం కూడా మోడీ చెప్పారు. తన తల్లి వందేళ్ళు జీవించిందని ఆమె చివరి రోజులలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సాధారణ మహిళగానే వైద్య సేవలు అందుకుందని తాను సీఎం గా పదమూడేళ్ళు, ప్రధానిగా పదేళ్ళూ ఉన్నా తన బ్రాండ్ అంటే ఇదీ అని మోడీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.

అంటే తాను పేదల మనిషిని అని అతి సామాన్యుడిని అని ఆయన చెప్పారు అని అంటున్నారు. మోడీ అంటే సగటు జనంలో ఒకరు అన్నది ఆయన చివరి విడతల ఎన్నికల ప్రచారంలో చెప్పదలచుకున్నారు అని అంటున్నారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నాను అని తన పనితీరే ఒక బ్రాండ్ అని ఆయన అన్నారు. అసలు మోడీ బ్రాండ్ అంటూ ప్రచారం చేస్తూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు అర్ధం లేదని మోడీ పేర్కొనడం విశేషం.

మొత్తం మీద చూస్తే నరేంద్ర మోడీ అంటే కార్పోరేట్ శక్తులకు దగ్గరవారు అని ధనవంతులు బడా బాబులకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది అన్నది ఇండియా కూటమి నుంచి వస్తున్న బలమైన విమర్శ. ఈసారి ఎన్నికల్లో ఈ అంశం కూడా జనంలోకి బాగా వెళ్తోంది. దాంతో నరేంద్ర మోడీ ఇపుడు తన జీవితం అంటే సాదా సీదాదే అని తనకు ఎక్కువ జతల బట్టలు ఫ్యాషన్లు అంటూ లేవని తాను తన తల్లి కుటుంబం అంతా సాదర జనాలతోనే అని చెప్పుకుంటున్నారు.

మరి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మొదట్లో మోడీ దూకుడుగానే ప్రసంగించేవారు. ఈ మధ్యలోనే ఆయన పేదల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇపుడు తాను కూడా వారితోనే అంటున్నారు మొత్తానికి ఈసారి జనాల మూడ్ ఏంటో బీజేపీ పెద్దలకు చూచాయగా అయినా అర్ధం అవుతోందని అందుకే మోడీ ప్రసంగాలూ అలా తిరిగి చివరికి బీదల దగ్గర ఆగుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి వీటి ప్రభావం ఎంత మేరకు ఉంటుందో.

Tags:    

Similar News