ముయిజ్జు ఆటలు చెల్లవ్.. మాల్దీవుల్లో ఇక చెల్లేది మన 'యూపీఐ'నే
అలాంటి యూపీఐని ఇప్పుడు భారత వ్యతిరేక వైఖరి కనబర్చిన నాయకుడు రారమ్మని ఆహ్వానిస్తుండడం గమనార్హం.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI).. భారత దేశానికి ఓ సొంత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఉండాలంటూ .. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న మన దేశానికీ సొంత ముద్ర ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం 2016 సమయంలో ప్రవేశపెట్టిన వ్యవస్థ.. ప్రపంచంలోనే అత్యంత అత్యధిక చెల్లింపులు జరుగుతున్న పేమెంట్ సిస్టమ్ గానూ రికార్డులకెక్కుతోందిది. వ్యక్తులు, వ్యాపారాల మధ్య వేగం, సులభ లావాదేవీల కోసం రూపొందించిన తక్షణ చెల్లింపు వ్యవస్థ యూపీఐ.. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ బాగా అందుబాటులోకి రావడంతో తిరుగులేని స్థానంలో నిలిచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దీనిని పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలను మొబైల్ యాప్ నకు లింక్ చేయడానికి, రెగ్యులర్ బ్యాంక్ ఖాతా వివరాలకు బదులుగా వర్చువల్ చెల్లింపు చిరునామా (యూపీఐ ఐడీ)ని ఉపయోగించి నిధులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఏడాది జనవరిలోనే రూ.18.41 లక్షల కోట్ల విలువైన 12.20 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయంటే దీని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి యూపీఐని ఇప్పుడు భారత వ్యతిరేక వైఖరి కనబర్చిన నాయకుడు రారమ్మని ఆహ్వానిస్తుండడం గమనార్హం.
జనవరిలో ఇలా..
హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశం మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఎన్నికైన ఆయన.. ఆ వెంటనే మాల్దీవులు పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేకున్నా. తమ ద్వీపంలో మోహరించిన భారత బలగాలను వెళ్లిపోవాలని కోరారు. చిన్న ద్వీపమైన మాల్దీవులపై పట్టు కోసం చైనా పోటీ పడుతుండడంతో మయిజ్జు వ్యవహరించిన తీరు వివాదం రేపింది. మాల్దీవుల్లో మోహరించిన భారత బలగాలు.. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రేడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి. అలాంటిది ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నేత మయిజ్జు పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా అనుకూలవాది, మాజీ అధ్యక్షుడు యామీన్‌కు మయిజ్జు సన్నిహితుడు. దీంతోనే అనేక అనుమానాలు కలిగాయి.
పర్యటకంపై దెబ్బకొట్టేసరికి..
భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్ష దీవులకు దిగువన మాల్దీవులు ఉంటాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వెళ్లే కీలక సముద్ర మార్గం దీనికి సమీపంలోనే ఉంది. అయితే, మాల్దీవులు చాలా చిన్న దేశం. దీంతో భారత్ ఎక్కువగా సాయం చేసింది. అంతేకాదు.. మాల్దీవుల్లో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా భారత భద్రతకు పెద్ద ముప్పు. కాగా, 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్ గయూమ్ భారత్ వ్యతిరేక వైఖరితో చైనాకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఇబ్రహీం సోలిహ్ భారత్ తో సన్నిహితంగా ఉన్నారు. కానీ, మయిజ్జు మాత్రం వస్తూనే భారత వ్యతిరేక వైఖరి కనబర్చారు. దీంతోపాటు ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మాల్దీవ్స్ వద్దు.. లక్ష దీవ్స్ ముద్దు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. క్రికెటర్లు, సినీ స్టార్లు సైతం మద్దతు తెలపడంతో మాల్దీవ్స్ కు బుక్ చేసుకున్న విమాన టికెట్లు రద్దయ్యాయి. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అయిన ఆ దేశానికి దెబ్బకు దిమ్మ తిరిగింది. దీంతో మాల్దీవ్స్ ప్రభుత్వం దిగొచ్చింది. మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులను ఇటీవల తొలగించింది. అంతేకాదు.. మయిజ్జు భారత్ లో పర్యటించి ఇటీవల భార్యతో సహా తాజ్ మహాల్ ను సందర్శించడం గమనార్హం. ఇప్పుడు వీటి కంటే కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.
అక్కడ మన చెల్లింపుల వ్యవస్థ..
మాల్దీవులలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించేందుకు ఏజెన్సీని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ముయిజు ప్రకటించారు. బ్యాంకులు, టెలి కమ్యూనికేషన్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ బేస్ ఆర్థిక సంస్థలు (ఫిన్ టెక్) కూడా ఈ కన్సార్షియంలో చేర్చాలని సూచించారు. ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు వెళ్లి..యూపీఐకి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ ట్రేడ్ ఆఫ్ మాల్దీవుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇప్పుడు క్యాబినెట్ కూడా సిఫార్సు చేయడంతో తమ దేశంలో యూపీఐని ప్రారంభించాలని మయిజ్జు నిర్ణయించారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.