మటన్ లేదంటే మొహమ్మద్ షమీకి పిచ్చెక్కిపోద్దట!

పేస్ బౌలర్లకు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. బలవర్ధమైకన ఆహారం తీసుకుంటేనే వారు కండపట్టి బంతిని వేగంగా విసరగలుగుతారు

Update: 2024-07-27 16:30 GMT

క్రికెట్ లో .. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ లో పేస్ బౌలర్లకు ఉండే ప్రాధాన్యమే వేరు. వారు ఎంత బలీయంగా ఉంటే బంతిని అంత కచ్చితంగా, బలంగా విసరగలుగుతారు. అంతెందుకు.. 45 ఏళ్ల కిందట భారత్ లో పేస్ బౌలర్ అంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఎవరికో కాదు.. కపిల్ దేవ్ వంటి పేస్ బౌలింగ్ దిగ్గజానికే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. భారత్ లో పేస్ బౌలర్లు పుట్టరు అని అతడిని ఎద్దేవా చేశారు. అయితే, ఇదంతా గతం. ఇప్పుడు మన దేశంలోనూ ఒకరికి పదిమంది పేస్ బౌలర్లు ఉన్నారు. 150 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులు వేయగల ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ వంటి వారూ దొరికారు.

షమీ.. మటన్

పేస్ బౌలర్లకు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. బలవర్ధమైకన ఆహారం తీసుకుంటేనే వారు కండపట్టి బంతిని వేగంగా విసరగలుగుతారు. ప్రస్తుత టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కెరీర్ ప్రారంభంలో చాలా బక్కపలచగా ఉండేవాడు. దీంతో అతడిని బలమైన (మాంసాహారం) తినాలంటూ కామెంటేటర్లు సూచించేవారు. ఇక ప్రస్తుత జట్టులో మేటి బౌలర్ అయిన మొహమ్మద్ షమీ గురించి చెప్పేదేముంది. మధ్యలో గాయాలతో దూరమైనా.. పదేళ్లుగా అతడు జట్టుకు అత్యంత విలువైన సేవలందించాడు. నిరుడు జరిగిన వన్డే ప్రపంచకప్ లో షమీ ప్రతిభను అందరూ చూశారు. అలాంటి షమీ గాయంతో ప్రపంచ కప్ తర్వాత పోటీ క్రికెట్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటూ వస్తున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఫిట్‌ నెస్ సాధించి, సెప్టెంబ‌రులో బంగ్లాదేశ్‌ తో టెస్టు సిరీస్‌ కు రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉందని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి.

కాగా ష‌మీ డైట్ గురించి అత‌డి సహచర పేసర్ ఉమేశ్ యాదవ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. శుభాంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌ లో ఉమేశ్ మాట్లాడుతూ షమీకి మాంసాహారం అంటే ఎంతో ఇష్ట‌మ‌ని తెలిపాడు. అందులోనూ మ‌ట‌న్ లేనిదే షమీకి ముద్ద దిగ‌ద‌న్నాడు. అతడికి రోజూ మ‌ట‌న్ ఉండాల్సిందేన‌ని, వ‌రుస‌గా రెండు,మూడు రోజులు మ‌ట‌న్ తిన‌క‌పోతే ష‌మి బౌలింగ్ లో వేగం గంట‌కు 15 కి.మీల‌కు పడిపోతుందని వివరించాడు. డైట్ లో ఏ తేడా వ‌చ్చినా స‌హిస్తాడు గానీ, మ‌ట‌న్ లేకుంటే మాత్రం ఊరుకోడని తెలిపాడు. మ‌ట‌న్ తిన‌కుండా ఒక్క‌ రోజుకు మించి ఉండలేడని పేర్కొన్నాడు. రెండో రోజు మాత్రం అత‌డిలో ఆందోళ‌న క‌నిపిస్తుందని.. మూడో రోజు కూడా తిన‌కుంటే మాత్రం నియంత్ర‌ణ కోల్పోతాడని పేర్కొన్నాడు. షమీకి షాపింగ్‌ చేయడం అంటే సరదా అని కూడా తెలిపాడు. మ్యాచ్‌లు లేనపుడు తనను ఢిల్లీలో షాపింగ్‌ కు తీసుకువెళ్తాడని ఉమేశ్‌ వివరించాడు.

Tags:    

Similar News